సీసీ కెమెరానే ఫస్ట్ ఇన్ ఫార్మర్! | Malkajgiri Police New Tech Strategy | Sakshi
Sakshi News home page

సీసీ కెమెరానే ఫస్ట్ ఇన్ ఫార్మర్!

Sep 2 2026 1:41 AM | Updated on Sep 2 2026 1:41 AM

Malkajgiri Police New Tech Strategy

గల్లీలో గొడవచేసినా.. గంజాయి సేవించినా... మందు కొట్టినా మటాషే

నేరం జరగకముందే పట్టేస్తారు..మల్కాజ్‌గిరి పోలీసుల సరికొత్త ‘టెక్‌’వ్యూహం

లక్ష క్రైమ్‌ హాట్‌ స్పాట్లు గుర్తింపు.. క్లస్టర్లుగా వర్గీకరించి నిఘా

ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్ల వద్ద 25 వేల సీసీటీవీ కెమెరాలు

గత నెలలో 345 మందిపై ఈ–పెట్టీ కేసులు నమోదు

నేరగాళ్ల కదలికలకు బ్రేక్‌..అసాంఘిక శక్తుల గుండెల్లో వణుకు

సాక్షి, హైదరాబాద్‌ : శాంతిభద్రతల పరిరక్షణలో మల్కాజిగిరి పోలీసులు సరికొత్త టెక్నాలజీతో సరిహద్దులు దాటుతున్నారు. నేరం జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడానికి, వారు పారిపోయిన మార్గాలను, వాడిన వాహనా­లను గుర్తించడానికి మాత్రమే సీసీటీవీ కెమెరాలను వాడేవారు. కానీ మల్కాజ్‌గిరి పోలీసులు ‘నేరం జరగక ముందే దాన్ని గుర్తించి అడ్డుకోవడం’అనే సరికొత్త వ్యూహంతో దూసుకు­పోతున్నారు. ఇక్కడ ఏకంగా సీసీ కెమెరానే మొదటి ఫిర్యాదుదారుగా మారి అసాంఘిక శక్తుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు వినూత్న రీతిలో డేటా విశ్లేషణ చేసి, మొత్తం లక్ష క్రైమ్‌ హాట్‌ స్పాట్లను గుర్తించారు. 

ఈ ప్రాంతాలన్నింటినీ నిఘా సౌలభ్యం కోసం ప్రత్యేక క్లస్టర్లుగా వర్గీకరించారు. రాత్రి వేళల్లో గల్లీలు, నిర్మానుష్య రోడ్లు, మైదానాల్లో మద్యం సేవించడం, గంజాయి తాగడం, ముఠాలుగా చేరి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే, ఇలాంటి అసాంఘిక చర్యలు జరిగే ప్రాంతాలే భవిష్యత్తులో పెద్ద పెద్ద నేరాలకు పునాదిగా మారుతాయని పోలీసులు గుర్తించారు. నేరగాళ్ల కదలికలకు పూర్తిగా బ్రేక్‌ వేయడానికి ప్రతి క్రైమ్‌ హాట్‌ స్పాట్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌ మార్గాల వద్ద 25 వేల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటితో నిత్యం ఆయా ప్రాంతాలు పోలీసుల నిఘాలో ఉంటాయి. ఏమాత్రం అనుమానాస్పద కదలికలు కనిపించినా, గుర్తు తెలియని వ్యక్తుల, వాహనాలను గుర్తించినా వెంటనే అప్రమత్తం అవుతున్నారు.

కేసులు నమోదు.. 25 మంది ప్రత్యేక బృందం
ఈ నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి 25 మంది నిపుణులైన సభ్యులతో ఒక ప్రత్యేక టెక్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఒక ఏసీపీ నేతృత్వంలో పనిచేసే ఈ ప్రత్యేక బృందం, సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగంలో ప్రత్యేక విభాగంగా రాత్రింబవళ్లు పర్యవేక్షణ సాగిస్తోంది. ఆగస్టు నెలలో మల్కాజ్‌గిరి కమిషనరేట్‌ పరిధిలో 345 మందిపై ఈ–పెట్టీ కేసులు నమో­దు చేశారు. ఆయా నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చగా.. కోర్టు సోషల్‌ సర్వీస్, ట్రాఫిక్‌ డ్యూటీలు, స్వచ్ఛ భారత్‌ వంటి జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా విధించింది. ఉప్పల్‌ జోన్‌ పరిధిలోని చర్లపల్లి, ఘట్‌కేసర్, మేడిపల్లి, పోచారం, కుషాయిగూడ, నాచారం, ఉప్పల్‌ ఠాణాలలో అధికంగా ఈ–పెట్టీ కేసులు, శిక్షలు ఖరారయ్యాయి.

కొత్తగా లక్ష కెమెరాలు లక్ష్యం..
ప్రస్తుతం మల్కాజ్‌గిరి కమిషనరేట్‌లో 2,58,058 సీసీటీవీ కెమెరాలు­న్నాయి. వీటిల్లో 2,44,828 నేను సైతం, 13,230 కమ్యూనిటీ కెమెరాలు. ఇక, 2026–27 మధ్యకాలంలో కమిషనరేట్‌ పరిధిలో కొత్తగా మరో లక్ష కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 29,607 నేను సైతం, 428 కమ్యూనిటీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరో 5,377 కమ్యూనిటీ కెమెరాలను పునరుద్ధరించారు.

తప్పు చేస్తే దొరికిపోతారు
టెక్నాలజీతో నేరగాళ్లను పట్టుకోవడానికే పరిమితం కాదు.. తప్పు చేస్తే వెంటనే దొరికిపోతాం అనే భయాన్ని నేరస్థుల్లో ముందే నాటడం దీని ప్రధాన ఉద్దేశం. టెక్నాలజీ, మానవ వనరుల అద్భుతమైన సమన్వయంతో అసాంఘిక శక్తులకు, ట్రబుల్‌ మాంగర్స్‌(ఉద్దేశపూర్వకంగా గొడవలు, అలజడులు, సమస్యలు సృష్టించేవారు)కు చెక్‌ పడుతోంది.  – బి.సుమతి, కమిషనర్, మల్కాజ్‌గిరి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement