 
													మానుకోట ప్రభుత్వ ఆస్పత్రిలో అమానవీయ ఘటన
మరుసటిరోజు ఉదయం బతికున్నాడంటూ చికిత్స
నెహ్రూసెంటర్: ఓ వ్యక్తిని బతికుండగానే మార్చురీకి తరలించిన అమానవీయ ఘటన మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గురువారం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన వెల్ది రాజు అనారోగ్యంతో రెండురోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వచ్చాడు. అయితే ఆధార్ కార్డు లేదనే కారణంతో ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకోకపోవడంతో ఎటూ వెళ్లలేక ఆవరణలోనే పడుకున్నాడు. దీంతో సదరు వ్యక్తి మృతిచెందాడని భావించిన సిబ్బంది అనాథ శవమని బుధవారం సాయంత్రం మార్చురీ ఆవరణలో పెట్టి వెళ్లారు. కాగా, గురువారం ఉదయం శానిటేషన్ సిబ్బంది రాజు కదలడాన్ని గమనించి వెంటనే పోలీసులు, ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు.
ఈ మేరకు ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో రాజుకు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై ఆర్‌ఎంఓ జగదీశ్వర్‌ను వివరణ కోరగా.. ఆస్పత్రి మార్చురీ గది ఎదుట రాజు పడి ఉండగా, మృతి చెందినట్లు భావించిన సిబ్బంది మార్చురీ ఆవరణలో వదిలివెళ్లారని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. విధులు సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే ఇబ్బందులు పడాల్సి వస్తోందని వైద్యులపై ఆర్‌ఎంఓ ఆగ్రహం వ్యక్తం చేయడం కొసమెరుపు. ఆస్పత్రి ఘటనపై సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మార్చురీ బయట ఉన్న అనాథను సిబ్బంది తీసుకువచ్చి ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తుండగా కొంతమంది కావాలనే కుట్రలు చేస్తున్నారని, ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
