
కూకట్‌పల్లి: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో చోటుచేసుకున్న బాలిక సహస్రిని హత్య కేసులో దర్యాప్తు వేగవంతమయ్యింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బాలానగర్ జోన్ డీసీపీ సురేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాలిక మర్డర్ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నదని, అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ముగ్గురు అనుమానితులను విచారిస్తున్నామని, టెక్నికల్ యాంగిల్స్ లో కూడా కేసు దర్యాప్తు చేస్తున్నామని, ఇందులో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని డీసీపీ సురేశ్ తెలిపారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా క్లూస్ టీం ఫింగర్ ఫ్రింట్‌లాంటి ఆధారాలు సేకరించింది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తెలిసిన వారే ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా గాంధీ ఆసుపత్రిలో బాలికకు పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం బాలిక స్వస్థలమైన సంగారెడ్డి జిల్లాలోని మక్త క్యాసారంనకు డెడ్‌బాడీని తరలించారు. ఇక పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
పోలీసులుతో బిల్డింగ్ ఓనర్ రమేష్.. తన మనుమరాలి చెకప్ కోసం హాస్పిటల్‌కి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపాడు. కూకట్‌పల్లిలోని దయార్‌గూడలో 11 ఏళ్ల బాలిక సహస్రిని ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో గొంతుకోసి, కడుపులో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. హత్య జరిగిన అదే భవనంలో ఉంటున్న ఓ యువకుడు అక్కడక్కడే సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.