‘స్టార్టప్‌ స్టేట్‌’ తెలంగాణ | KTR showcases Telangana growth model at Columbia Business School | Sakshi
Sakshi News home page

‘స్టార్టప్‌ స్టేట్‌’ తెలంగాణ

Apr 6 2026 1:22 AM | Updated on Apr 6 2026 1:22 AM

KTR showcases Telangana growth model at Columbia Business School

తెలంగాణ ప్రస్థానం అంటే ఆత్మగౌరవం, ఆకాంక్ష, పురోగతికి నిదర్శనం 

బీఆర్‌ఎస్‌ హయాంలోనే దిగ్గజ సంస్థలకు హైదరాబాద్‌ చిరునామాగా మారింది 

ఏఐ, లైఫ్‌ సైన్సెస్, ఫిన్‌టెక్, అగ్రిటెక్‌ సమ్మేళనంతోనే వృద్ధి 

కొలంబియా బిజినెస్‌ స్కూల్‌ 21వ వార్షిక ఇండియా బిజినెస్‌ కాన్ఫరెన్స్‌లో కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: భారతదేశంలో అత్యంత విజయవంతమైన ‘స్టార్టప్‌ స్టేట్‌’తెలంగాణ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు అన్నారు. తెలంగాణ ప్రస్థానం అంటే ఆత్మగౌరవం, ఆకాంక్ష, పురోగతికి నిదర్శనమని చెప్పారు. అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ప్రతిష్టాత్మక కొలంబియా బిజినెస్‌ స్కూల్‌లో జరిగిన 21వ వార్షిక ఇండియా బిజినెస్‌ కాన్ఫరెన్స్‌లో ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించారు.

సుదీర్ఘ పోరాటం ద్వారా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో పరిపాలన, ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధిలో దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. ‘మేము అవకాశాల కోసం ఎదురుచూడలేదు. వాటిని అందిపుచ్చుకోవడానికి అద్భుతమైన పాలసీలను తయారు చేశాం. మౌలిక సదుపాయాలను కల్పించాం. తద్వారా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించి వృద్ధిని సాధించాం’అని కేటీఆర్‌ వివరించారు.

2027లో భారత్‌ 80వ స్వాతంత్య్ర దినోత్సవానికి సిద్ధమవుతున్న వేళ కేవలం పదేళ్లలోనే తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతి గర్వకారణమన్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపే నాయకత్వానికి స్పష్టత ఉంటే జవాబుదారీతనం పెరుగుతుందని.. తద్వారా అభివృద్ధి వేగవంతమవుతుందని చెప్పారు. భవిష్యత్తు గురించి కేవలం మాటలు చెప్పడం కంటే, దానిని మనమే సృష్టించడం ఉత్తమమైన మార్గమని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 

రాష్ట్రాలే దేశాభివృద్ధికి ఇంజన్లు.. దీన్ని కేంద్రం గుర్తించాలి.. 
భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని కేటీఆర్‌ ప్రస్తావిస్తూ దేశాభివృద్ధి కేవలం ఒకే రకమైన విధానాల వల్ల కాకుండా ప్రతి రాష్ట్రం తనకున్న ప్రత్యేక బలాలను వినియోగించుకోవడం ద్వారా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ‘భారత్‌ 28 ఇంజన్లుగల ఒక ఫార్ములా–1 రేసింగ్‌ కార్‌ లాంటిది. ప్రతి రాష్ట్రం తనదైన శైలిలో అభివృద్ధి చెందుతూ దేశ ప్రగతికి తోడ్పడాలి. అంతర్జాతీయ పెట్టుబడి నిర్ణయాలు చివరికి రాష్ట్రాలు, నగరాల స్థాయిలోనే జరుగుతాయి’అని కేటీఆర్‌ గుర్తుచేశారు. ఐటీ, పారిశ్రామిక రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని తెలిపారు.

2014 నుండి 2023 మధ్య కాలంలో తెలంగాణ సాంకేతిక రంగం సాధించిన గణాంకాలను కేటీఆర్‌ వివరించారు. ప్రభుత్వ వేగవంతమైన నిర్ణయాలు, పటిష్టమైన ఎకో సిస్టమ్‌ కారణంగానే హైదరాబాద్‌ గ్లోబల్‌ ఐటీ దిగ్గజాలకు చిరునామాగా మారిందన్నారు. హైదరాబాద్‌లో అమెజాన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేసిందని, గూగుల్, ఆపిల్, మెటా, సేల్స్‌ ఫోర్స్, ఉబర్, మైక్రాన్‌ టెక్నాలజీ వంటి సంస్థలు తమ కీలక కార్యకలాపాలను ఇక్కడ నిర్వహిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆవిష్కరణలకు చిరునామా తెలంగాణ మారిందన్నారు. టీ–హబ్, వీ–హబ్, టీ–వర్క్స్, టాస్క్‌ వంటి సంస్థల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరణలకు పెద్దపీట వేసిందని కేటీఆర్‌ వివరించారు. స్కైరూట్‌ ఏరోస్పేస్, డారి్వన్‌ బాక్స్, జెనోటి, హైరేడియస్‌ వంటి యూనికార్న్‌ సంస్థలు హైదరాబాద్‌ నుంచి పుట్టుకురావడమే తెలంగాణ సత్తాకు నిదర్శనమన్నారు. 

ప్రపంచ వ్యాక్సిన్‌ రాజధానిగా తెలంగాణ.. 
తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ప్రపంచానికే వ్యాక్సిన్‌ రాజధానిగా ఎదిగిందని.. ప్రపంచ వ్యాక్సిన్లలో మూడో వంతు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని కేటీఆర్‌ వెల్లడించారు. ఏటా 10 బిలియన్‌ డోసుల టీకాలను తెలంగాణ ఉత్పత్తి చేస్తోందని.. దేశీయ బల్క్‌ డ్రగ్‌ ఉత్పత్తిలో 40 శాతం వాటా తెలంగాణదేనని చెప్పారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల గురించి ప్రస్తావిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీపర్పస్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ అయిన కాళేశ్వరం ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని వివరించారు.

ఏఐ, లైఫ్‌ సైన్సెస్, ఫిన్‌టెక్, అగ్రిటెక్‌ వంటి రంగాల సమ్మేళనంతోనే తదుపరి వృద్ధి సాధ్యమని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఉన్న విద్యార్థులు, నిపుణులు భారత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ‘కేవలం ఆలోచనల దగ్గర ఆగిపోకుండా వాటిని సాధించేందుకు నిబద్ధతతో కూడిన ప్రణాళికలను రూపొందించండి. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు.. ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నిర్మించండి. నేటి సమస్యల పరిష్కారమే కాదు.. రేపటి అవసరాలకు తగిన సామర్థ్యాన్ని పెంపొందించుకోండి’అని పిలుపునిస్తూ కేటీఆర్‌ తన ప్రసంగాన్ని ముగించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement