మేమేం పాపం చేశాం నాన్న.. | Karimnagar Father Twin Daughters Incident | Sakshi
Sakshi News home page

మేమేం పాపం చేశాం నాన్న..

Apr 4 2026 7:45 AM | Updated on Apr 4 2026 11:19 AM

Karimnagar Father Twin Daughters Incident

కరీంనగర్‌ రూరల్‌: ఆడపిల్లలుగా పుట్టడమే ఆ చిన్నారుల పాలిట శాపంగా మారింది. కన్నతండ్రే కాలయముడుగా మారి కవల పిల్లలకు గడ్డిమందు తాగించి చంపి వ్యవసాయబావిలో పడేసిన సంఘటన సంచలనం సృష్టించింది. కరీంనగర్‌ మండలం జూబ్లీనగర్‌కు చెందిన కచ్చు శ్రీశైలంకు మానకొండూరు మండలం లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన మౌనికతో ఆరేళ్ల కిందట వివాహమైంది. వీరికి కవల ఆడపిల్లలు గీతాన్‌శ్రీ, గీతాన్విక (4) ఉన్నారు. 

శ్రీశైలం ప్రస్తుతం సమీపంలోని ప్రతిమ ఆస్పత్రిలో పనిచేస్తుండగా మౌనిక వ్యవసాయ పనులకు వెళ్తోంది. కవల ఆడపిల్లలు పుట్టారని శ్రీశైలం భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. కుటుంబసభ్యులు పలుమార్లు పంచాయితీ నిర్వహించి, భార్యాభర్తలకు సర్ది చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు భార్యతో గొడవ పడిన శ్రీశైలం ఇద్దరు పిల్లలను ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లి గడ్డిమందు తాగించి సమీపంలోని వ్యవసాయ బావిలో పడేశాడు.

 పిల్లల గురించి మౌనిక ప్రశ్నించడంతో ఇద్దర్ని చంపి బావిలో పడేశానని శ్రీశైలం చెప్పడంతో స్థానికులతో కలిసి బావి వద్దకు వెళ్లింది. సమాచారం అందుకున్న రూరల్‌ ఏసీపీ విజయ్‌కుమార్, సీఐ నిరంజన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బావిలో దిగి గాలించగా పెద్ద పాప గీతాన్‌శ్రీ మృతదేహం లభించింది. పిల్లల్ని చంపారనే కోపంతో శ్రీశైలంపై స్థానికులు దాడి చేయగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గజ ఈతగాళ్ల సాయంతో బావిలో గాలించగా రాత్రి 8.30 గంటలకు గీతాన్విక మృతదేహం దొరికింది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement