నేడు కాంగ్రెస్‌కు రాజీనామా.. జీవన్‌ పయనమెటు? | Jeevan Reddy resign To Congress Party | Sakshi
Sakshi News home page

నేడు కాంగ్రెస్‌కు రాజీనామా.. జీవన్‌ పయనమెటు?

Mar 25 2026 6:56 AM | Updated on Mar 25 2026 11:38 AM

Jeevan Reddy resign To Congress Party

సాక్షి,జగిత్యాల: నేడు కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఈ సందర్భంగా జగిత్యాలలో ఆయన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. రాజీనామా అనంతరం ఏఐసీసీ, పీసీసీకి లేఖ పంపనున్నారు.

కాంగ్రెస్‌తో నాలుగు దశాబ్దాల రాజకీయ బంధానికి తెగదెంపులు పెట్టనున్న జీవన్ రెడ్డి, తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. రాజీనామా విషయంలో చివరి క్షణం వరకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నించింది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ దూత వంశీచందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి కలిసినా జీవన్ రెడ్డి ససేమిరా అన్నారు.దీంతో జీవన్ రెడ్డి రాజీనామా, ఆయన భవిష్యత్తు రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 ఈ క్రమంలో ఆయన భవిష్యత్తుపై పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి. స్థానిక స్థాయిలో బలమైన మద్దతు ఉన్న నేతగా జీవన్ రెడ్డి ఎటు వెళ్లినా ఆ పార్టీకి బలం చేకూరుస్తారనే అభిప్రాయం ఉంది. ఆయన స్వతంత్రంగా కొనసాగడం, బీఆర్‌ఎస్‌లో చేరడం లేదా బీజేపీలోకి వెళ్లడం వంటి అవకాశాలు చర్చనీయాంశమవుతున్నాయి.

జీవన్ రెడ్డి నిర్ణయం ఆయన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుతో పాటు జగిత్యాల ప్రాంతీయ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపనుంది. ముఖ్యంగా, ఆయన తుది నిర్ణయం పూర్తిగా అనుచరుల అభిప్రాయాలపైనే ఆధారపడి ఉండటం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement