పాతబండిపై ఇక కొత్త బాదుడు!

Indias Vehicle Scrappage Policy Is Your Car Fit For The Road - Sakshi

కాలం చెల్లిన వాహనాలపై భారీగా హరితపన్ను 

లైఫ్‌ట్యాక్స్‌లో మూడోవంతు వడ్డన 

 గ్రీన్‌ట్యాక్స్‌ పెంపుపై త్వరలో విధివిధానాలు

హైదరాబాద్‌: పాత బండ్లపై కొత్త బాదుడుకు రంగం సిద్ధమవుతోంది. పదిహేనేళ్లు దాటిన వాహనాలను మరోసారి రిజిస్ట్రేషన్‌ చేసుకొంటే భారీగా హరితపన్ను చెల్లించాల్సిందే. దీనికిగాను అధికారులు త్వరలో విధివిధానాలను ఖరారు చేయనున్నారు. వాహనాల జీవితకాల పన్నులో ఇది మూడోవంతు వరకు ఉండొచ్చని తెలుస్తోంది. వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు, కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు కేంద్రం ప్రత్యేక పాలసీని తెచ్చింది. స్వచ్ఛందంగా వదులుకొనేవారికి కొత్త వాహనాలపై రాయితీ ఇస్తూనే పాతవాటిని పునరుద్ధరించుకొనేవారికి భారీగా వడ్డించనున్నారు. మొదటి దశలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలను స్క్రాప్‌ చేస్తారు. వాటి స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రవేశపెడతారు. రెండోదశలో రవాణా, వ్యక్తిగత వాహనాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు. ఏడాదికోసారి హరితపన్ను చెల్లించి రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. 

గ్రేటర్‌లో 2006 నుంచే హరితపన్ను
పాత వాహనాలపై గ్రేటర్‌లో 2006 నుంచే హరితపన్ను వసూలు చేస్తున్నారు. వాహనాల రద్దీని, కాలుష్యాన్ని తగ్గించేందుకు భూరేలాల్‌ కమిటీ సిఫారసుల మేరకు రవాణాశాఖ ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు  రూ. 250–350 వరకు గ్రీన్‌ట్యాక్స్‌ చెల్లించి చాలా మంది బండ్లను పునరుద్ధరించుకుంటున్నారు. అయితే ఇది వ్యక్తిగత వాహనాల జీవితకాల పన్నులో మూడోవంతు వరకు విధించడం వల్ల వాహన ధరల శ్రేణికి అనుగుణంగా కనిష్టంగా రూ. 6 వేల నుంచి రూ. లక్ష వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో గ్రీన్‌ట్యాక్స్‌ విధానాన్నే కేంద్రం దేశమంతా అమలు చేయాలనుకుంటోంది.

గ్రేటర్‌లో 14 లక్షలపైనే...
జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం 60 లక్షల వరకు వాహనాలు ఉన్నాయి. ఏటా సుమారు 2 లక్షల వాహనాలు కొత్తగా నమోదవుతున్నాయి. వ్యక్తిగత వాహనాలు విస్ఫోటన స్థాయికి చేరుకోగా, ప్రజారవాణా వాహనాల వినియోగం తగ్గుముఖం పడుతోంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సుమారు 23 లక్షల మేర కాలం చెల్లిన వాహనాలున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్‌ జిల్లాల పరిధిలో 14 లక్షల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top