
హైదరాబాద్: నగరంలోని కొండాపూర్‌లోగల బిక్షపతి నగర్‌లో శనివారం ఉదయం నుంచే హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్లు హైడ్రా సిబ్బంది పేర్కొన్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కాగా కూల్చివేతల వద్దకు మీడియాను కూడా పోలీసులు అనుమతించడం లేదు. రెండు కిలోమీటర్ల దూరంలోనే మీడియాను, స్థానికులను పోలీసులు అడ్డుకుంటున్నారని సమాచారం.
కాగా, హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా అక్రమ నిర్మాణాలు భారీస్థాయిలో చేపట్టారు యథేచ్ఛగా అక్రమార్కులు నిబంధనలని ఉల్లంఘిస్తున్నారు. అక్రమ నిర్మాణాలతో పలు ప్రాంతాలు వర్షాకాలంలో వరదలకు గురవుతున్నాయి. ఈ సమస్యపై హైడ్రా ఫిర్యాదులు వస్తోండటంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసే చర్యలు చేపట్టింది.
దీనిలో భాగంగా గత నెలలో గాజులరామారంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించారు. దాంతో చర్యలు చేపట్టింది హైడ్రా. గాజులరామారంలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించారు. 15వేల కోట్ల విలువైన భూమి ఆక్రమణకు గురికావడంతో దీనిపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. అనంతరం, హైడ్రా రంగంలోకి దిగింది.
కబ్జాల చెర నుంచి 300 ఎకరాలకు పైగా భూమికి విముక్తి కల్పించారు. కబ్జాదారులు 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి రూ.10 లక్షల చొప్పున స్థానికులకు విక్రయించినట్టు అధికారులు గుర్తించారు. హైడ్రా కూల్చివేతల సందర్బంగా అక్రమార్కులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు.
