అందుకే ఒవైసీ ఫాతిమా కాలేజీ కూల్చివేయడం లేదు.. హైడ్రా క్లారిటీ | HYDRA Clarify On Owaisi Fatima College Demolition | Sakshi
Sakshi News home page

అందుకే ఒవైసీ ఫాతిమా కాలేజీ కూల్చివేయడం లేదు.. హైడ్రా క్లారిటీ

Jul 9 2025 9:07 AM | Updated on Jul 9 2025 10:48 AM

HYDRA Clarify On Owaisi Fatima College Demolition

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో సలకం చెరువులో నిర్మించిన ఒవైసీ ఫాతిమా కాలేజీని కూల్చివేయకపోవడంపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ అయినందునే దానిపై చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. అయితే, ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఎంఐఎం నాయకుల నుంచి దాదాపు 1,000 కోట్ల ఆస్తులను ఇప్పటికే రికవరీ చేసుకున్నట్టు పేర్కొంది.

ఎంఐఎం ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ కూల్చివేతపై తాజాగా హైడ్రా స్పందించింది. ఈ సందర్బంగా హైడ్రా..‘అక్బర్ కాలేజీని ఎందుకు కూల్చివేయడం లేదని ఇప్పుడు అందరు అడుగుతున్నారు. కాలేజీ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించినందున గత సెప్టెంబర్‌లో తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పాం. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ సంస్థ నడుస్తోంది. ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరు. ఈ కాలేజీలో 10,000 మందికి పైగా బాలికల నుంచి యువతుల వరకు విద్యను అభ్యసిస్తున్నారు. పేద ముస్లిం మహిళలకు వెనుకబాటు తనం నుంచి విముక్తి కల్పిస్తున్నారు

పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ అయినందునే దానిపై చర్యలు తీసుకోవడం లేదు. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నాం. ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కబ్జా చేసిన భారీ నిర్మాణాలను కూల్చివేశాం. 25 ఎకరాల సరస్సును ఫ్లాట్ గా మార్చిన ఒవైసీ కుటుంబానికి సన్నిహితుడి కట్టడాలను కూడా కూల్చేశాం. ఎంఐఎం నాయకుల నుంచి దాదాపు 1,000 కోట్ల ఆస్తులను ఇప్పటికే రికవరీ చేసుకున్నాం. చాంద్రయాన్‌గుట్టలో ఎంఐఎం కార్పొరేటర్ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నాం. సామాజిక కారణాల వల్లనే ఫాతిమా కాలేజీ కూల్చివేతను నిలిపివేశాం. సామాజిక స్పృహతో కాలేజీ నడుస్తుందని దాని పట్ల మెతకవైఖరి అవలంబిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. 

ఇదిలా ఉండగా.. అంతకుముందు, ఫాతిమా కాలేజీ విషయమై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ కళాశాల జోలికి వెళ్లబోమని హైడ్రా కమిషనర్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఆ కళాశాల జోలికి పోతే ఏం అన్యాయం జరుగుతుందో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేయాలి. ఇది ప్రభుత్వ నిర్ణయమా? లేక ఆ అధికారి సొంత నిర్ణయమో చెప్పాలి. మూసీ పరీవాహక ప్రాంతంలో పేదల గుడిసెలను కూల్చిన హైడ్రా అధికారులు.. అక్బరుద్దీన్‌ ఒవైసీ కళాశాలకు మాత్రం గతేడాది నోటీసులిచ్చి ఊరుకున్నారని.. ఆ కళాశాలను ఈ ఏడాది మరోచోటుకు తరలించాలని ఎందుకు చెప్పలేదో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement