సాక్షి, హైదరాబాద్: నగరంలోని చాదర్‌ఘాట్‌లో కాల్పుల కలకలం రేగింది. చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న దొంగలను సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య పట్టుకునేందుకు యత్నించగా.. డీసీపీపై దొంగలు కత్తితో దాడికి యత్నించారు. తోపులాటలో డీసీపీ గన్‌మెన్ కిందపడిపోయారు. ఈ క్రమంలో గన్‌మెన్ నుంచి వెపన్ తీసుకుని దొంగలపై డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు.

దొంగలపై డీసీపీ చైతన్య రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు దొంగల్లో ఒకరికి గాయాలు కాగా, నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఇద్దరు దొంగల్లో ఒకరికి గాయాలయ్యాయని.. డీసీపీతో పాటు మిగతా సిబ్బంది క్షేమంగా ఉన్నారని తెలిపారు.

రౌడీలు, స్నాచర్లపై ఉక్కుపాదం మోపుతాం: సీపీ సజ్జనార్
చాదర్ ఘాట్‌లోని కాల్పులు జరిగిన ప్రాంతాన్ని సీపీ సజ్జనార్ పరిశీలించారు. కాల్పుల్లో చైన్ స్నాచర్ ఒమర్ ఛాతి, భుజంపై గాయాలయ్యాయి. ఒమర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు చైన్ స్నాచర్లు పాతబస్తీకి చెందిన పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. ఒమర్‌పై 25 కేసులు ఉన్నాయని.. రౌడీషీట్ కూడా ఉందని సీపీ సజ్జనార్ తెలిపారు.
‘‘ఆత్మ రక్షణలో భాగంగా డీసీపీ కాల్పులు జరిపారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు చాదరగట్టి విక్టోరియా ప్లేగ్రౌండ్ వద్ద ఘటన జరిగింది. రౌడీ షీటర్ మొబైల్స్ స్నాచర్స్ ఇద్దరూ స్నాచింగ్ చేస్తుండగా డీసీపీ చైతన్య పట్టుకునే ప్రయత్నం చేశారు. ఒమర్ రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. దొంగను చేజ్ చేస్తూ పట్టుకునేందుకు డీసీపీ తన గన్‌మెన్ వచ్చారు. దొంగ కత్తితో గన్‌మెన్‌పై దాడి చేశాడు. వెంటనే డీసీపీ చైతన్య రెండు రౌండ్లు దొంగపై కాల్పులు జరిపారు. దొంగకు చేతిపై, కడుపులో గాయాలయ్యాయి.
దొంగను మాలకపేట యశోద ఆసుపత్రికి తరలించాం. పరారీలో ఉన్న మరో దొంగ కోసం గాలిస్తున్నాం. డీసీపీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గాయలైన కానిస్టేబుల్ లు ఇద్దరూ ఆసుపత్రిలో క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తాం. మహమ్మద్ ఉమర్ అన్సారీ.. కేసులు.. నేరాలు.. అతనికి సహకరిస్తున్న వారిని గుర్తిస్తాం’’ అని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.


