
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ పరిదిలో గణపతి లడ్డూ వేలం రికార్డు సృష్టించింది. బండ్లగూడ కీర్తి రిచ్‌మండ్ విల్లాలో రూ.2 కోట్ల 30 లక్షల రికార్డు ధర పలికింది. శుక్రవారం రాత్రి జరిగిన వేలం పాటలో 10 కేజీల లడ్డును బాలాగణేష్ టీం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది ఇదే విల్లాలో జరిగిన వేలంపాటలో రూ.1.87 కోట్లకు లడ్డూ పోగా.. ఈసారి రూ.45 లక్షలు అదనంగా వెళ్లింది. మొత్తం 80 విల్లా ఓనర్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి 500కి పైగా బిడ్లతో ఈ వేలంపాటలో పాల్గొన్నారు. సుమారు రెండున్నర గంటలపాటు ఈ వేలంపాట సాగడం గమనార్హం.
42 ఎన్జీవోలను నిర్వహించే ఓ ట్రస్టుకు ఈ డబ్బును విరాళంగా ఇవ్వబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూర్తిగా వలంటీర్లతో నడిచే ఈ ట్రస్ట్ ద్వారా 10 వేల మందికి సాయం అందుతోంది, ప్రతీ పైసా నేరుగా క్షేత్రస్థాయిలోకే వెళ్తుందని అంటున్నారు.
ఈ విల్లాలో 2018 నుంచి లడ్డూ వేలంపాట నడుస్తోంది. ఆ టైంలో రూ.25 వేలకు లడ్డూ పోయింది. 2019లో రూ. 18.75, 2020లో రూ.27.3లక్షలు, 2021లో రూ. 41 లక్షలు, 2022లో రూ.60 లక్షలు, 2023లో రూ.1.26 కోట్లకు పోయింది. మనస్పర్థలు రాకూడదనే గ్రూపులుగా విడిపోయి లడ్డూ వేలంపాటలో పాల్గొంటున్నారు. అయితే లడ్డూను మాత్రం అన్ని కుటుంబాలు కలిసే పంచుకుంటాయని చెబుతున్నారు.
