300 పోలీసు అధికారుల ఇళ్లల్లోకి వరద నీరు

Hyderabad Rains CP Anjani Kumar Asks Cops People Stay Alert - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారీ వర్షాల ధాటికి భాగ్యనగరం అతలాకుతలమవుతోంది. రోడ్లు, కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వరద బీభత్సంలోనూ ప్రాణాలు పణంగా పెట్టి, అలుపెరుగక విధులు నిర్వర్తిస్తున్న పోలీసు కుటుంబాలను సైతం వాన కష్టాలు వెంటాడుతున్నాయి. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఇంట్లోకి వరద నీరు చేరడంతో, నాలుగు రోజులుగా ఆయన ఆఫీసులోనే ఉంటూ డ్యూటీ చేస్తున్నారు. మరో 300 మంది పోలీసు అధికారుల ఇళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు తమ కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నప్పటికీ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. (చదవండి: హైదరాబాద్‌లో భారీ వర్షం.. కొట్టుకొచ్చిన కొండచిలువ)

ఇక నగరంలోని ప్రస్తుత పరిస్థితి గురించి సీపీ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ.. వరద సహాయక చర్యల కోసం ముమ్మర ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మూసి లోతట్టు ప్రాంతంలో కొన్ని చోట్ల వరద నీరు ఉందని, కుల్సుంపుర, కార్వాన్, తప్పాచపుత్ర, అఫ్జల్‌గంజ్‌, మలక్‌పేట్‌, చాదర్‌ఘాట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం వరద ఉధృతి కాస్త ఎక్కువగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఫలక్‌నామా ఏరియాలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. ముంపు ప్రాంతాల్లో పోలీసులు విస్త్రృత సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అదే విధంగా, ఇప్పటికే ఆర్మీ కూడా రంగంలోకి దిగిందని, రెస్క్యూ ఆపరేషన్‌ జరుగుతున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. 

నా హీరో వీరేందర్‌: అంజనీ కుమార్‌
‘‘చిక్కడ్‌పల్లి పోలీస్‌ కానిస్టేబుల్‌ వీరేందర్‌ నా హీరో. వరద నీటిలో చిక్కుకుపోయిన 25 మందిని ఆయన కాపాడారు. అరవింద్‌ నగర్‌, దోమలగూడ వద్ద ఇది జరిగింది. ఇలాంటి ఆఫీసర్లే మా బృందంలో ఉన్న నిజమైన స్టార్లు. ఆయనకు సెల్యూట్‌ చేస్తున్నా. అలాగే హైదరాబాద్‌ పోలీసులకు ప్రోత్సాహం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు’’అంటూ సీపీ అంజనీ కుమార్‌ కానిస్టేబుల్‌ వీరేందర్‌పై ప్రశంసలు కురిపించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top