హైదరాబాద్‌ వేదికగా ‘ఫ్లేవర్స్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌’  | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ వేదికగా ‘ఫ్లేవర్స్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌’ 

Published Wed, Nov 23 2022 1:44 AM

Hyderabad: Mane launches Flavour Innovation Centre - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయంగా ఫ్లేవర్స్, ఫ్రాగ్రన్స్‌ పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఫ్రాన్స్‌కు చెందిన ‘మనే’ ఫ్రాగ్రన్స్‌ అండ్‌ ఫ్లేవర్స్‌ అగ్రగామి తయారీ సంస్థ చైర్మన్‌ జీన్‌ మనే తెలిపారు. మనే గ్రూప్స్‌ ఆధ్వర్యంలో నగరంలోని రాయదుర్గ్‌ వేదికగా మంగళవారం ఫ్లేవరస్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఆహారం, పరిమళాలకు సంబంధించిన పరిశ్రమల్లో అవసరమైన ఫ్లేవర్స్‌ను అందించడంలో భాగంగా పరిశోధనాభివృద్ధి కార్యకలాపాల కోసం 3 మిలియన్‌ యూరోల వ్యయంతో ఈ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జీన్‌ మనే మాట్లాడుతూ., భారత్‌లో ఫ్లేవర్స్‌ రంగంలో అతిపెద్ద వేదికగా ఈ సెంటర్‌ను ప్రారంభించామని, రానున్న మూడేళ్లలో సంస్థ పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా 45 మిలియన్‌ యూరోలను వెచ్చించనున్నామని తెలిపారు. ఈ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ద్వారా ఆహార పదార్థాలు, పానియాలు, చాక్లెట్, బేకరీ ఉత్పత్తులు, స్వీట్, కన్ఫెక్షనరీ తదితరాలకు అవసరమయ్యే ఫ్లేవర్స్‌ను సేకరించి ఉత్పత్తి సంస్థలకు అందిస్తామని వెల్లడించారు.

తమ సంస్థ 56 శాతం గ్లోబల్‌ రెవెన్యూతో అంతర్జాతీయంగా 5వ స్థానంలో ఉందని, ఇందులో 8  శాతం భారత్‌ నుంచే ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. మనే ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఫ్లేవర్స్‌ ఇన్నోవేషన్‌ సెంటర్,  ముంబైలో ఫ్రాగ్రన్స్‌ స్టూడియోను నిర్వహిస్తున్నామన్నారు. ఫ్లేవర్స్‌ను సేకరించే ప్లాంట్‌లను ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళలో నిర్వహిస్తున్నామని, స్పైస్‌ కోసం ఇక్కడ లభించే మిరప అత్యుత్తమమైనదని చెప్పారు.

తెలంగాణలోని దుండిగల్‌లో కూడా తమ ఉత్పత్తి కేంద్రం సేవలందిస్తోందని వివరించారు. నగరంలోని ఈ ఇన్నోవేషన్‌ సెంటర్‌ అధునాతన సాంకేతిక విధానంలో పరిశోధనలు చేస్తూ పారిశ్రామికంగా అవసరమైన ఫార్ములాలను రూపొందిస్తోందని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుమిత్‌ దాస్‌ గుప్తా తెలిపారు. పరిశోధనాభివృద్ధి కోసం అధునాతన ల్యాబరేటరీలను కొనసాగిస్తున్నామని గ్రూప్‌ ఆసియా పసిఫిక్‌ డైరెక్టర్‌ బె ర్నార్డ్‌ లేనౌడ్‌ పేర్కొన్నారు. ఈ సంస్థ భారత్‌తో పాటు శ్రీలంక, నేపాల్‌లలో సేవలందిస్తోందని చెప్పారు.

Advertisement
Advertisement