
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన పంట, ఆస్తినష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర హోంశాఖ హైపవర్ కమిటీని త్వరలో రాష్ట్రానికి పంపించనుంది. మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలసి తెలంగాణలో వరదల వల్ల సంభవించిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.
ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే స్పందిస్తూ హోంశాఖ ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి బృందాన్ని తక్షణమే తెలంగాణకు పంపాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారని సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీ వరదల కారణంగా ఏర్పడ్డ నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.