
సాక్షి, హైదరాబాద్: పెళ్లికాకుండానే గర్భందాల్చి 28 వారాల గర్భంతో ఉన్న ఓ బాలిక అబార్షన్‌కు ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రాణాపాయం ఉందన్న వైద్య నివేదిక నేపథ్యంలో ప్రసవం వరకు ఆమెను డిశ్చార్జ్ చేయొద్దని.. నిరంతరం వైద్యం అందించాలని నిలోఫర్ ఆస్పత్రిని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 29కి వాయిదా వేసింది.
తన కుమార్తె గర్భాన్ని (కవలలు) తొలగించేందుకు నిలోఫర్ వైద్యులను ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఏడాది జూలై 22 నాటి వైద్య నివేదిక ప్రకారం తన కుమార్తె గర్భధారణ వయసు 27 వారాలు (ట్విన్ ఏ), 25 వారాలు (ట్విన్ బీ) అని పేర్కొంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక మరోసారి విచారణ చేపట్టారు.
మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలన్న గత ఉత్తర్వుల మేరకు నివేదిక అందించిన నిలోఫర్ సూపరింటిండెంట్... గర్భాన్ని తొలగిస్తే మైనర్ బాలిక ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషనర్ విజ్ఞప్తిని నిరాకరించారు.