చదువుతో పాటు ప్రాణాలూ ముఖ్యమే..

High Court Comments On The Reopening Of Educational Institutions - Sakshi

విద్యాసంస్థల ప్రారంభంపై హైకోర్టు వ్యాఖ్యలు

థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో అప్రమత్తత అవసరం.. గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు తెరవొద్దు

మిగతా పాఠశాలలు ఆన్‌లైన్‌ లేదా ప్రత్యక్ష తరగతులు లేదా రెండింటినీ నిర్వహించుకోవచ్చు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో.. వారు కరోనా బారినపడకుండా సురక్షితంగా ప్రాణాలతో ఉండడం అంతకంటే ముఖ్యమని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రత్యక్ష తరగతులకు హాజరైన విద్యార్థి కరోనా బారినపడి మృతి చెందితే ఆ విద్యార్థి తల్లిదండ్రుల బాధ, క్షోభ వర్ణనాతీతమని పేర్కొంది. విద్యా సంవత్సరం కోల్పోయినా పరవాలేదు.. పిల్లలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలనే తల్లిదండ్రులు కోరుకుంటారని వ్యాఖ్యానించింది. పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులకు యూనిసెఫ్‌ సూచించినా.. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని అభిప్రాయపడింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), విపత్తు నిర్వహణ సంస్థ (డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌)లు ఇదేవిధంగా చెబుతున్నాయంది. కరోనా మూడో దశ ప్రభావం ముఖ్యంగా పిల్లలపై ఉంటుందనే డాక్టర్ల హెచ్చరికల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు, సంక్షేమ హాస్టళ్లను ప్రారంభాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరుకావాలంటూ ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేయరాదని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. 

హడావుడిగా ప్రారంభిస్తున్నారు..
సెప్టెంబర్‌ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలంటూ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన అధ్యాపకులు ఎం.బాలక్రిష్ణ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకుండా అకస్మాత్తుగా, హడావుడిగా ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలనే ఆదేశాలిచ్చారని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చించిన తర్వాతే ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలనే నిర్ణయం తీసుకుందని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు.
 
ప్రభుత్వం సమన్వయం చేయాలి
ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంది. ‘విద్యా సంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతారన్న అభిప్రాయం ఒకవైపు, తెరిస్తే వారి ప్రాణాలను ఎలా కాపాడతారన్న సందేహం మరోవైపు ఉన్నాయి. ఈ రెండింటినీ ప్రభుత్వం సమన్వయం చేయాలి’ అని అభిప్రాయపడింది. పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వానికి పలు ఆదేశాలు, సూచనలు జారీ చేసింది. తాము కోరిన సమాచారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని విద్యా శాఖ కార్యదర్శి, పాఠశాల విద్య, ప్రజా ఆరోగ్య విభాగం సంచాలకులతో పాటు నీలోఫర్‌కు చెందిన నిపుణుల కమిటీలను ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబర్‌ 4కు వాయిదా వేసింది. 

ఏ పాఠశాలపైనా చర్యలు తీసుకోవద్దు
‘గురుకులాలు తెరవొద్దు. ఇతర పాఠశాలల్లో చదువుకునే ఏ విద్యార్థినీ ప్రత్యక్ష తరగతులకు హాజరుకావాలని యాజమాన్యాలు ఒత్తిడి చేయరాదు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభిం చాలంటూ ఇటీవల ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రత్యక్ష తరగతులు నిర్వహించని ఏ పాఠశాల మీదా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులకు హాజరు కాని విద్యార్థులకు జరిమానా విధించడం లాంటి వాటితో పాటు ఏ రకమైన చర్యలూ తీసుకోరాదు. పాఠశాలలో విద్యార్థి కరోనా బారిన పడితే పాఠశాల యాజమాన్యానికి ఎటువంటి బాధ్యత ఉండదని, ఇందుకు అంగీకరిస్తూ పత్రం సమర్పించాలని విద్యా ర్థుల తల్లిదండ్రులను ఒత్తిడి చేయడం చట్ట విరుద్ధం, అనైతికం. పాఠశాలల యాజమా న్యాలు కేవలం ఆన్‌లైన్‌ లేదా కేవలం ప్రత్యక్ష తరగతులు నిర్వహించుకోవచ్చు. లేదా రెండింటినీ నిర్వహించుకునే స్వేచ్ఛ ఉంది.’

వారం రోజుల్లో మార్గదర్శకాలు రూపొందించాలి
‘ఈ ఆదేశాలు ప్రీ ప్రైమరీ, ప్రైమరీ పాఠశాలల విద్యార్థులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు వర్తి స్తాయి. పాఠశాలలో ప్రత్యక్ష తరగతుల నిర్వ హణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్ర త్తలపై వారం రోజుల్లో ప్రభుత్వం మార్గదర్శ కాలు రూపొందించాలి. వీటిని ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి..’ అని కోర్టు ఆదేశించింది.

ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయి?
‘రాష్ట్రంలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఎన్ని ఉన్నాయి ? గురుకులాలు, వసతిగృహాల్లో విద్యా ర్థులు వైరస్‌ బారినపడకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు?  పాఠశాలల ప్రారంభానికి సంసిద్ధతపై ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్యాల నుంచి నివేదికలు ఏమైనా తీసుకున్నారా? పిల్లలు కరోనాబారిన పడితే చికిత్స అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఎన్ని పడకలు అందుబాటులో ఉంచారు?’ తదితర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. నీలోఫర్‌ వైద్యులతో కూడిన నిపుణుల కమిటీ నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

అన్నీ పరిగణనలోకి తీసుకుని...
‘కరోనా మూడో దశ సెప్టెంబర్‌/అక్టోబర్‌ నెలల్లో వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికలు వస్తున్నాయి. 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇప్పటికీ ఇవ్వలేదు. 18 ఏళ్లు నిండని వారికి ఇంకా వ్యాక్సిన్‌ రాలేదు. చిన్నారులు కరోనా బారిన పడినా, వారికి లక్షణాలు కనిపించే అవకాశం ఉండదని పరిశో« దకులు చెబుతున్నారు. పాఠశాల పిల్లలు టీచింగ్, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌తో సన్నిహితంగా మెలిగే అవ కాశం ఉంది. అయితే సిబ్బంది అందరికీ ఇంకా వ్యాక్సిన్‌ ఇవ్వలేదు. వీరి ద్వారా కరోనా విద్యా ర్థులకు వ్యాపించే అవకాశం ఉంది. వారిద్వారా వారి కుటుంబసభ్యులకు రావొచ్చు. అలాగే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న చిన్నారులు సైతం కరోనా బారినపడే అవకాశం ఉంది. విద్యార్థులు భౌతిక దూరం పాటించడం, పాఠశాలలో ఉన్నంత సేపు మాస్కు ధరించడం చాలా కష్టం.

అదే సమయంలో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు, కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని కోరుకోవడానికి సహేతుకమైన కారణాలు ఉండొచ్చు. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులో లేనివారు ప్రత్యక్ష తరగతులు కోరుకోవడం సహజమే. అలాగే మధ్యాహ్న భోజన పథకం ఆశించేవారు, ఇతర ఆర్థికపరమైన కారణాలున్నవారు కూడా ఈ విధం గా కోరుకోవచ్చు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అందరి హక్కులు, ప్రయోజనాలు, ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని ఉత్తర్వులు జారీ చేస్తున్నాం..’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top