ఏపీలో దంచికొట్టిన వాన.. HYDలో మరో రెండు గంటలు అలర్ట్‌! | Heavy Rain Fall At Many Places In Andhra Pradesh And Telangana In Coming Three Days, Watch Videos And Weather Update Inside | Sakshi
Sakshi News home page

Hyderabad Heavy Rainfall: ఏపీలో దంచికొట్టిన వాన.. HYDలో మరో రెండు గంటలు అలర్ట్‌!

May 15 2025 8:38 AM | Updated on May 15 2025 11:40 AM

Heavy Rain Fall In Hyderabad And Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తర.. దక్షిణ ధ్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక, గురువారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లో వర్షం కురుస్తోంది. మరో రెండు గంటల పాటు పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. 

ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు.. మరోవైపు వానలు దంచికొడుతున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, నిన్న శ్రీకాకుళం జిల్లాల్లో 5.3 సెంమీ వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. రాప్తాడు, కందుకూరు, ఆకుతోటపల్లి వద్ద కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పోలీసులు, ఫైర్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

 

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఉత్తర.. దక్షిణ ధ్రోణి ప్రభావంతో  తెలంగాణలో మూడు రోజుల( మే 14 నుంచి) పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ శాఖ ప్రకటించి తెలిసిందే.. తెలంగాణ లోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. రోజంతా ఎండ మండిపోతున్నప్పటికీ.. సాయంత్రం అయ్యేసరికి వర్షం దంచికొడుతోంది.. ఈ క్రమంలో గురువారం ( మే 15 ) కూడా వర్షాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. 

గురువారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది.. అమీర్‌పేట్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, దిల్‌సుఖ్‌ నగర్, కోఠి, యూసఫ్ గూడా, కూకట్‌పల్లి, అల్వాల్‌, సుచిత్ర, జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది.. ఉదయం 9 గంటల సమయానికి వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని..  ఉదయం అంతా ఆఫీసుకు వెళ్లే సమయం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. వర్షం కురిసే సమయంలో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.  

ఇదిలా ఉండగా.. తెలంగాణలోని మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోను ఉదయం నుంచి వర్షం కురుస్తుంది. వేసవిలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన వడ్లు పూర్తిగా నీటమునిగాయి. దీంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement