‘సొంతిల్లు స్వంతమవుతుందని అనుకోలేదు’

Harish Rao Started Double Bedroom House At Siddipet - Sakshi

సిద్దిపేటలో డబుల్‌బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన హరీశ్‌ ‌రావు

సాక్షి, సిద్దిపేట: పేదల మోముల్లో ఆనందపు వెలుగులు నింపేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా, ఖర్చుకు వెనుకాడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుపేదలకు డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్ల నిర్మాణం చేపట్టారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  తన్నీరు హరీశ్‌ ‌రావు పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట పట్టణం కేసీఆర్ నగర్‌లో 180 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ఎఫ్‌డీసీ వంటేరు ప్రతాప్ రెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్మన్ రాజనర్సుతో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... అర్హులైన నిరుపేదలకు ఇళ్లు దక్కడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీస్సులతో... నర్సాపూర్‌లో 2460 రెండు పడక గదుల ఇల్ల నిర్మాణం సకల సౌకర్యాలతో ప్రైవేట్ ఇండ్ల సముదాయాలకు ధీటుగా పూర్తి చేశామన్నారు. ఈ ఇళ్ళు నిర్మించేందుకు మాకు నాలుగేళ్ల సమయం పట్టిందని మంత్రి తెలిపారు. ఈ నాలుగేళ్లలో నాలుగు వందల సార్లు నిర్మాణ స్థలాన్ని సందర్శించి స్వంత ఇంటి మాదిరి మనసు పెట్టి ఇండ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. 

మొదటి దశలో 1341 మంది లబ్ధిదారులను గుర్తించామని మంత్రి తెలిపారు. నిజమైన పేదలకు ఇల్లు దక్కాలని ఆరు నెలలు కష్టపడి ఏలాంటి ఆరోపణలకు తావులేకుండా పేదరికమే ప్రామాణికంగా అర్హులను మాత్రమే ఎంపిక చేశామన్నారు. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా అధికారులతో సహా 200కు పైగా అధికారులు అహర్నిశలు శ్రమించారని మంత్రి గుర్తు చేశారు. ఇండ్ల కేటాయింపులో రాజకీయ జోక్యం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. తొలి దశలో ముఖ్యమంత్రి సమక్షంలో 144 మంది లబ్ధిదారులు.. ఈ రోజు 180 మంది గృహ ప్రవేశాలు చేశారన్నారు. ప్రతీ ఇంట్లో విద్యుత్, నల్లా, గ్యాస్ కనెక్షన్, పైపులు అన్ని సక్రమంగా పని చేస్తున్నాయో లేదో సరి చూసుకుంటూ దశల వారీగా లబ్ధిదారులకు పట్టాలు అందిస్తూ గృహ ప్రవేశాలు జరిగేలా చూస్తున్నామన్నారు.

ఇంకా మిగిలిన 1000 ఇండ్లకు సంబంధించి పున: పరిశీలన ప్రక్రియ జరుగుతుందని వారిలో అర్హులైన వారికి త్వరలోనే రెండు పడక గదుల ఇళ్లను కేటాయిస్తామన్నారు హరీశ్‌ రావు. ఏ ఒక్క నిరుపేదకు అన్యాయం జరగకూడదన్న ధ్యేయంతో సాంకేతికత దన్నుగా బిగ్ డేటా తో సరిపోల్చుతూ...అర్హులు మాత్రమే లబ్ది పొందేలా చూస్తున్నామన్నారు.మరో 1000 ఇండ్లు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేయగా వెంటనే మంజూరు చేశారన్నారు హరీశ్‌ రావు. (చదవండి: ఇళ్లు అవే.. ఎన్నికలే వేరు)

జోర్డార్ వసతులతో.... నయా పైసా ఖర్చు లేకుండా
బహిరంగ విపణిలో రూ.15 లక్షలు విలువ చేసే డబుల్ బెడ్ రూం ఇండ్లను సకల సౌకర్యాలతో పేదలకు ఉచితంగా అందిస్తున్నామన్నారు హరీశ్‌ రావు. లబ్ధిదారులకు పట్టాలు అందజేసే సమయంలోనే.... పట్టా ఉత్తర్వుతో పాటు..నల్లా కనెక్షన్ మంజూరు పత్రం, కరెంట్ కనెక్షన్ , ఇంటి నెంబర్, పైపుడ్ గ్యాస్ కనెక్షన్ లు అందజే స్తున్నా మన్నారు. అంతే కాకుండా స్వంత అన్నయ్య లా ఆశీర్వదిస్తూ.. నూతన వస్త్రాలు బహుకరించి గృహ ప్రవేశాలు చేపిస్తున్నాము. కేటాయించిన పక్కా ఇండ్లను పది కాలాల పాటు కాపాడు కోవాల్సిన బాధ్యత లబ్ధిదారుదే అన్నారు. ఇండ్లను కిరాయికి ఇచ్చినా, అమ్ముకున్నా తిరిగి స్వాధీనం చేసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అక్తర్ పటేల్, సుడా(ఎస్‌యూడీఏ) వైస్ చైర్మన్ రమణ చారి, మున్సిపల్ కౌన్సిలర్‌లు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ నగర్ ప్రజల సౌకర్యార్థం మంత్రి తన్నీరు హరీష్ రావు బస్సు సేవలను ప్రారంభించారు. ప్రతీ రోజూ కేసిఆర్ నగర్ నుంచి కోటి లింగాలు, కాల కుంట వరకు బస్సు సేవలు అందుబాటులో కి వచ్చాయి.

నిరుపేదల మోముల్లో ఆనందపు వెలుగులు
నిన్న మొన్నటిదాకా కిరాయి ఇంట్లో ఉంటూ... నేడు స్వతింటి కల సాకారం కావడంతో లబ్ధిదారుల్లో డబుల్‌ సంతోషం వెల్లివిరిసింది. గృహ ప్రవేశాలు సందర్భం గా లబ్ధిదారులు తమ సంతోషాన్ని సమాచార శాఖ తో పంచుకున్నారు. అభిప్రాయాలు వారి మాటల్లోనే.... (చదవండి: ‘వారిద్దరూ తోడు దొంగలు)

నిన్నటి దాకా అద్దింట్లో .. నేడు ఆత్మగౌరవంతో సొంతిట్లో
మాకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు.నిన్న మొన్నటి వరకూ సిద్దిపేట బాలాజీ నగర్‌లోని అద్దింట్లో ఉన్నాం. దినసరి కూలీ తో వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. డబుల్ బెడ్ రూం కోసం అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నాం. అనేక వడపోత ల తర్వాత మాకు ఈ రోజు  సొంత ఇల్లు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మా స్వంతింటి కల సాకారం చేసిన సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్ ‌రావులకు సదా రుణ పడి ఉంటాం.- చింది యాదగిరి - సంతోషి దంపతులు 

స్వంతిల్లు... సొంతం అవుతుంది అనుకొలే
పెండ్లైనప్పటి సుంది కిరాయికే ఉంటున్నాం. నా భర్త జహీరుద్దిన్ డ్రైవర్గా పని చేస్తూ ప్రమాదంలో గాయపడి అనారోగ్యానికి గురయ్యారు. మాకు 5 గురు సంతానం. బట్టలు కుడుతూ కుటుంబానికి అండగా ఉంటున్నాను. మా పెండ్లైన ప్పటి నుండి కిరాయికే ఉంటున్నాం. స్వంతిల్లు సొంతం అవుతుంది అనుకోలే.. హరీశ్‌ రావు సార్ మా కలను నెరవేర్చాడు. -మహ్మమదీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top