
లోపల ఏం చేసినా కనిపించకుండా పకడ్బందీగా సెక్షన్ పార్టిషన్
సెలవు రోజుల్లో టర్మ్ డ్యూటీ పేరుతో లైంగిక దాడులు..
జిల్లా ఉన్నతాధికారులకు ఓ ఉద్యోగిని ఫిర్యాదు..
అతని లీలలు విని అవాక్కయిన జిల్లా ఉన్నతాధికారి
హనుమకొండ ఐడీఓసీలో కలకలం రేపుతున్న సీనియర్ ఉద్యోగి తీరు
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్ (ఐడీఓసీ) భవనంలోని ఓ కీలక ప్రభుత్వ శాఖలో ‘సీనియర్’ ఉద్యోగి లైంగిక వేధింపులు పరాకాష్టకు చేరాయి. నాలుగేళ్లుగా కుర్చీ వదలకుండా పాతుకుపోయిన సదరు ఉద్యోగి తన చాంబర్‌ను ప్రత్యేక పార్టిషన్‌తో పకడ్బందీగా ఏర్పాటుచేసుకుని కిందిస్థాయి ఉద్యోగినులను వేధిస్తున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కారుణ్య నియామకాలు, డిప్యుటేషన్ల ద్వారా తన కార్యాలయానికి వచ్చిన జూనియర్లను అందులోనూ ముఖ్యంగా మహిళలను బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ చేస్తూ తన అవసరాలను తీర్చుకుంటున్నాడని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతని బారిన పడిన ఉద్యోగినుల్లో ఒకరు ధైర్యం తెచ్చుకుని నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఆ సెక్షన్ సీక్రెట్..
సదరు ఉద్యోగి ఒకప్పుడు కారుణ్యంకింద నియమితులయ్యారు. పరిపాలన భవనంలోని ఓ హాల్‌లో పార్టిషన్ చేసి ఉన్న ఆ సెక్షన్ లోపల ఏం జరిగేది బయటికి కనిపించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నాడు. అతని హోదాకు అంత సీక్రెట్ పార్టిషన్ ఎందుకు అని కొందరు అభ్యంతరం చెప్పినా తన పంతం నెగ్గించుకున్నాడని ఆరోపణలున్నాయి. అయితే ఈ పకడ్బందీ పార్టిషన్‌లోపల అతను చేసేవి కామకలాపాలుగా గమనించిన కొందరు ఉద్యోగులు తమకెందుకులే అనుకొని మిన్నకుండిపోతున్నారు. ఇటీవల సదరు ఉద్యోగి అరాచకాలు శృతిమించడం.. కామకలాపాల విషయం బయటికి రావడం, ఐడీఓసీలో తీవ్ర చర్చకు తెరలేపింది.
అధికారులకు ఫిర్యాదు...
అనంతరం పనిదినం రోజు ఓ జిల్లాస్థాయి అధికారి వద్దకు కొందరు కిందిస్థాయి మహిళా ఉద్యోగులు, బాధితురాలి కుటుంబ సభ్యులు వెళ్లి జరిగిందంతా చెప్పి న్యాయం చేయాలని కోరారు. ఈక్రమంలో సద రు అధికారి చెప్పిన తీర్పు కామాంధుడికి సరైన శిక్ష కా దని భావించిన ఉద్యోగులు నేరుగా జిల్లా ఉన్నతాధికారికి కలిసి పరిస్థితి వివరించారని సమాచారం. సదరు కామాంధుడు చేష్టలు విన్న ఉన్నతాధికారి అవాకై ్క లిఖి తపూర్వకంగా ఇవ్వాలని చెప్పి ఆమెను నుంచి ఫిర్యాదు తీసుకున్నట్లు తెలిసింది. ఇన్నిరోజులు అతనికి భయపడిన మహిళా ఉద్యోగులు ప్రస్తుతం ఒకరిద్దరు నిర్భయంగా ముందుకు వచ్చి కామాంధుడి వేధింపులు, తాము అనుభవించిన నరకయాతన తోటి ఉద్యోగులతో చెప్పుకోవడం కలెక్టరేట్‌లో హాట్‌టాపిక్ అయ్యింది.
కొసమెరుపు..
ఓవైపు మహిళా ఉద్యోగులు ఈ వ్యవహారంపై అగ్గిమీ ద గుగ్గిలమవుతుంటే అదే శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి మధ్యవర్తిగా వ్యవహారం కప్పి పుచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో బాధితులపై అన్ని రకాలుగా ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై జిల్లాకు బాస్‌గా ఉన్న మహిళా ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారని బాధిత మహిళా ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. కొంతకాలంగా తన క్యాబిన్‌నే అడ్డాగా మార్చుకుని చేసిన అక్రమాలు, వేధింపులపై సమగ్ర విచారణచేస్తే ఇతగాడి లీలలు మరిన్ని బయటపడే అకాశం ఉందని చెబుతున్నారు.
టర్మ్ డ్యూటీలో ఏం జరిగింది..?
కొద్ది రోజుల క్రితం టర్మ్ డ్యూటీ పేరుతో తను కన్నేసిన ఓ మహిళా ఉద్యోగికి విధులు కేటాయించారు. సహజంగా సెలవు దినం కావడంతో సదరు ఉద్యోగి కార్యాలయ ఆవరణలో ఉంది. ఆ సమయంలో వక్రబుద్ధితో కార్యాలయానికి వచ్చిన సదరు కామాంధుడు బయట ఉన్న ఉద్యోగిని లోనికి రమ్మని, తన టేబుల్ క్లీన్ చేయమని ఆదేశించాడు. బిక్కుబిక్కుమంటూ లోనికి వెళ్లిన ఉద్యోగి టేబుల్ క్లీన్ చేస్తుండగా క్యాబిన్ డోర్ క్లోజ్‌చేసి సదరు ఉద్యోగిని లైంగికంగా లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. ఆమె మెదట తనను ఏమీ చేయొద్దని ప్రాధేయపడినా వినకపోవడంతో తీవ్రంగా ప్రతిఘటించింది. అటుగా జనం అలికిడి రావడంతో అక్కడినుంచి కామాంధుడు మెల్లగా జారుకున్నట్లు సమాచారం.
వ్యూహాత్మకంగా తన వలలోకి..
సదరు సీనియర్ ఉద్యోగి కన్ను పడిన వారిని వ్యూహాత్మకంగా తన వలలోకి దింపుకునే వాడని తెలుస్తోంది. ఒంటరిగా సదరు ఉద్యోగి చాంబర్‌లోకి వెళ్లాలంటే మహిళలు హడలి పోతున్నారన్నది ప్రస్తుతం ఆ శాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మాటవినని ఉద్యోగులను వేధించడం, కష్టమైన విధులు కేటాయించడం, ఉన్నతాధికారుల పేరుతో బెదిరించడం, డిప్యుటేషన్ క్యాన్సిల్ చేస్తానని, బదిలీ చేస్తానంటూ ఆగ్రహించడం వంటి వేధింపులు ఇక్కడ చాలా మంది కిందిస్థాయి ఉద్యోగులకు నిత్యకృత్యంగా మారింది. కొందరికి మాత్రం సెలవులో వెళ్లినా అది రికార్డుల్లో నమోదు చేయకుండా మేనేజ్ చేయడం సదరు ఉద్యోగి లీలల్లో ఒకటిగా చెబుతుంటారు. కలెక్టరేట్‌లోని ’సీక్రెట్‘ క్యాబిన్‌లో ఇతను చేయని అడ్డమైన పని లేదని, సరససల్లాపాలకు అడ్డాగా తయారు చేసుకున్నాడని తీవ్రస్థాయిలో ఆరోపణలున్నాయి.
‘కలెక్టరేట్‌లో కామాంధుడు’ బదిలీ
సంచలనం రేపిన ‘సాక్షి’ కథనం
ఫిర్యాదుకు చేసేందుకు ముందుకు వస్తున్న మరికొందరు బాధితులు
ఘటనపై కలెక్టర్ సీరియస్..
విచారణకు ప్రత్యేక కమిటీ
హన్మకొండ అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న ఓ కామాంధుడి అరాచకంపై సమగ్ర వివరాలతో ‘సాక్షి’లో ‘కలెక్టరేట్‌లో కామాంధుడు’ శీర్షికన ప్రచురితమైన కథనం జిల్లాలో సంచలనం సృష్టించింది. ఇదే సమయంలో ఆ కామాంధుడి ఆకృత్యాల బారినపడిన మరికొందరు బాధితులు ‘సాక్షి’కి ఫోన్‌చేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము సైతం ఫిర్యాదుకు సిద్ధమని తెలిపారు. ఏ విధంగా తమను వేధించాడో వివరించారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కలెక్టరేట్ ‘ ఏ’ సెక్షన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆ కామాంధుడిని తక్షణ చర్యల్లో భాగంగా చింతగట్టు ఎస్సారెస్పీకి బదిలీ చేశారు. బాధితులతో మరోసారి నేరుగా మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుని లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్న కలెక్టర్ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇచ్చేందుకు ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ (ఐసీసీ) ఏర్పాటు చేశారు. కమిటీకి కన్వీనర్‌తోపాటు ఎన్జీఓ శాఖ ఉద్యోగులను సభ్యులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీ సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.
‘సాక్షి’కి అభినందనలు
సంవత్సరాల కాలంగా కలెక్టరేట్‌లో పాతుకుపోయి ఉద్యోగులను వేధిస్తూ మహిళా ఉద్యోగులను లైంగికంగా ఇబ్బందులు పెడుతున్న సదరు కామాంధుడిపై సమగ్ర కథనం ప్రచురించి బాధితుల పరిస్థితి బాహ్య ప్రపంచానికి తెలియజేసిన ‘సాక్షి’కి కలెక్టరేట్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ అక్రమార్కుడి బారిన పడిన ఇతర ఉద్యోగులు అతడి మరిన్ని అక్రమాలపై ‘సాక్షి’కి ఆధారాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. కామాంధుడి బాగోతంపై తీవ్రస్థాయిలో ఫిర్యాదులు అందాయి. వీరు సైతం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.