
సాక్షి, హైదరాబాద్: గ్రూప్ 1 అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ను టీజీపీఎస్సీ(TGPSC) బుధవారం ఆశ్రయించింది. ఇంతకు ముందు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. గ్రూప్ 1 ఫలితాలు, ర్యాంకులు రద్దు చేస్తూ ఈ నెల 9న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మార్చి 10న విడుదల చేసిన ఫలితాలను, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకులను రద్దు చేస్తూ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు నేతృత్వంలోని హైకోర్టు సింగిల్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఆదేశాల్లో... టీజీపీఎస్సీకి రెండు ఆప్షన్లను ఇచ్చింది.
ఒకటి.. మెయిన్స్ జవాబు పత్రాలను ఎలాంటి అవకతవకలు లేకుండా రీవాల్యూయేషన్ చేయాలి. సంజయ్‌సింగ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం మాన్యువల్(సాధారణ పద్ధతి)గా మూల్యాంకనం చేసి, ఆ ఫలితాల ఆధారంగా 563 పోస్టులను భర్తీ చేయాలి. ఆ రీవాల్యూయేషన్‌లోనూ పొరపాట్లు జరిగితే పరీక్ష నిర్వహణకు కోర్టే ఆదేశిస్తుంది.
రెండోది.. 2024 అక్టోబరు 21 నుంచి 27 మధ్య జరిగిన మెయిన్స్‌ను రద్దు చేసి, పరీక్షలను తిరిగి నిర్వహించాలి. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రక్రియను ఎలాంటి తప్పిదాలు లేకుండా ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలి అని హైకోర్టు స్పష్టంచేసింది. మరోవైపు ఈ తీర్పుపై గ్రూప్-1 ర్యాంకర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. దీంతో తదుపరి ఏం జరగబోతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.