వాహనాల గ్రీన్‌ట్యాక్స్‌ భారీగా తగ్గింపు

Green Tax Likely To Reduced Price In Telangana - Sakshi

7 నుంచి 15 ఏళ్ల లోపు వయసున్న వాహనాలకు రూ.1500, ఆపై వాటికి రూ.3 వేలు 

కొత్త ధరలను అమలులోకి తెచ్చిన రవాణాశాఖ 

సాక్షి, హైదరాబాద్‌: వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు పాత వాహనాలపై కేంద్రం విధించిన హరిత పన్ను (గ్రీన్‌ ట్యాక్స్‌)ను రాష్ట్రప్రభుత్వం భారీగా తగ్గించేసింది. వాహనాలు పాతబడేకొద్దీ వాటి నుంచి వెలువడే కాలుష్యం తీవ్రత పెరుగుతుంది. దీంతో పాత వాహనాల వినియోగాన్ని కట్టడి చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ ట్యాక్సును విధించిన విషయం తెలిసిందే.

15 సంవత్సరాలు దాటిన భారీ వాహనాలకు గరిష్టంగా రూ.25 వేల వరకు గ్రీన్‌ ట్యాక్స్‌ విధిస్తున్నారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక సమయంలో లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో మంత్రులు భేటీఅయి, గ్రీన్‌ ట్యాక్సును ఎత్తే­యాలన్న వారి డిమాండ్‌పై చర్చించారు. అత్యంత భారీగా ఉన్న గ్రీన్‌ట్యాక్స్‌ను నామమాత్రపు స్థాయికి తీసుకొస్తామన్నట్టుగా మంత్రులు ఆ భేటీలో హామీ ఇచ్చారు. ఈ మేరకు దాన్ని తగ్గిస్తూ రవాణాశాఖ కొత్త ధరలను అమలులోకి తెచ్చింది. 

కొత్త ధరలు.. మార్పులు ఇలా.. 
గతంలో వాహనాల వయసు ఆధారంగా మూడు శ్లాబుల్లో పన్ను విధింపు ఉండేది. ఏడు నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాహనాలకు ఒక త్రైమాసిక పన్నులో సగం మొత్తాన్ని గ్రీన్‌ టాక్స్‌గా విధించేవారు. 12–15 ఏళ్ల మధ్య ఉన్న వా­హనాలకు ఒక త్రైమాసిక పన్నుతో సమంగా విధించేవారు. 15 ఏళ్లు పైబడ్డ వాహనాలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు విధించేవారు. ఇప్పుడు ఆ మూడు శ్లాబులను రెండుగా మార్చారు. 

7 నుంచి 15 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాహనాలకు రూ.1500, 15 ఏళ్ల పైబడి వయసు ఉన్న వాహనాలకు రూ.3 వేలు పన్ను నిర్ధారించారు. రాష్ట్రంలో ఐదున్నర లక్షల వరకు వాణిజ్యపరమైన వాహనాలున్నాయి. వీటిల్లో 70 శాతం వాహనాలు గ్రీన్‌ట్యాక్స్‌ చెల్లిస్తున్నాయి. ఇప్పుడు ఆ ట్యాక్సును భారీగా తగ్గించడం పట్ల వాటి యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ, వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాల విషయంలో నిబంధనలను మరీ సరళతరం చేయటం సరికాదంటూ పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top