ప్రాజెక్టు స్థలంలో సర్వే చేపట్టేందుకు పరిపాలనా అనుమతులు జారీ
జీవోలో కనిపించని ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరు
ప్రస్తుతానికి తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు నీళ్లు తరలించడానికే పనులు పరిమితం
మలిదశలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీటి తరలింపుపై నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం పునరుద్ధరణ దిశగా కీలక ముందడుగు పడింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కొత్వాల్ కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించి సుందిళ్ల బరాజ్‌తో అనుసంధానం చేసే పనుల కోసం రూ. 11.88 కోట్ల అంచనా వ్యయంతో సవివర పథక నివేదిక (డీపీఆర్) తయారు చేసేందుకు పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా గత నెల 30న ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రాజెక్టు నిర్మిత స్థలంలో సర్వేతోపాటు సమగ్ర అధ్యయనాలను కన్సల్టెన్సీ ద్వారా జరిపి డీపీఆర్ రూపొందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త్వరలో కన్సల్టెన్సీ సేవల కోసం నీటిపారుదల శాఖ టెండర్లను ఆహ్వానించనుంది. ప్రాణహిత–చేవెళ్లను రెండు దశల్లో నిర్మించాలని ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు ప్రస్తుతానికి తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల బరాజ్‌కు నీటి తరలింపు పనుల కోసమే డీపీఆర్ తయారీకి ప్రభుత్వం అనుమతిచి్చంది. మలి దశలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీటి తరలింపు పనులకు ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉంది.
ఆదిలాబాద్ సహా కాళేశ్వరం ప్రాజెక్టుకు నీళ్లు..
ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద గోదావరిపై బరాజ్ నిర్మించి అక్కడి నుంచి 71.5 కి.మీ. దూరంలోని మైలారం వరకు గ్రావిటీ కాల్వ ద్వారా నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడి నుంచి 20.06 కి.మీ. మేర ఒక సొరంగం తవ్వి టేకుమట్ల వాగులో నీటిని పోయనుంది. వాగులో 11 కి.మీ. ప్రయాణించాక నీరు దిగువన ఉన్న సుందిళ్ల బరాజ్‌కు చేరుకోనుంది. సుందిళ్ల బరాజ్ నుంచి నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు సైతం తుమ్మిడిహెట్టి నుంచి వచ్చే నీటి సరఫరాకు వీలు కలగనుంది. ఇక తుమ్మిడిహెట్టి బరాజ్ నుంచి నేరుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీటి సరఫరా చేయనున్నారు.
ప్రాణహిత–చేవెళ్ల పేరు...
రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనులను పునరుద్ధరించి తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించడం తెలిసిందే. తాజాగా ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన కోసం ఇచి్చన జీవోలో మాత్రం ఎక్కడా ప్రాణహిత–చేవెళ్ల పేరును ప్రభుత్వం ప్రస్తావించలేదు. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించి గ్రావిటీ కాల్వ, సొరంగ మార్గంలో సుందిళ్ల బరాజ్‌తో అనుసంధానించే పనులకే డీపీఆర్ రూపకల్పనకు అనుమతిస్తున్నట్లు జీవోలో ఉంది. ఉమ్మడి ఏపీలో రూపొందించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు డీపీఆర్‌తో సంబంధం లేకుండా పూర్తిగా కొత్త ప్రాజెక్టుగా దీన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.


