
టీసీయూఆర్‌తోపాటు ఆరు కార్పొరేషన్లలో ఏర్పాటుకు ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్
బార్లు, క్లబ్‌లు, పర్యాటక స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్‌లు దరఖాస్తు చేసుకునే అవకాశం
నేటి నుంచి ఈనెల 25వ తేదీ వరకు దరఖాస్తులు... ఫీజు రూ.లక్ష మాత్రమే
1000 చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు.. ఎక్కడికక్కడే దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి తెలంగాణలో బీరు తాగాలంటే బార్ అండ్ రెస్టారెంట్‌కే వెళ్లాల్సిన పనిలేదు... వైన్‌షాపుల్లోనూ కొనుక్కోవాల్సిన అవసరం అంతకంటే లేదు... హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, పర్యాటక స్థలాల్లో ఎక్కడైనా దొరుకుతుంది. అప్పటికప్పుడు, అక్కడికక్కడ తయారు చేసిన బీర్‌ను మద్యం ప్రియులు ఆస్వాదించే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అంతే కాదు... బీర్ అమ్మాలంటే బార్ లైసెన్సు అవసరం లేదు.. వైన్‌షాపులకు టెండర్లు వేయాల్సిన పని అసలే లేదు.
వెయ్యి చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు.. అక్కడో హోటలో, రెస్టారెంటో ఉంటే చాలు.. అక్కడే తయారు చేసి ఎంచక్కా అమ్ముకోవొచ్చు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా మైక్రో బ్రేవరీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్)తోపాటు కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రేవరీల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ మేరకు టీసీయూఆర్‌తోపాటు ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలో మైక్రో బ్రేవరీల ఏర్పాటుకు గురువారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
రూ.లక్ష దరఖాస్తు రుసుం కింద చెల్లించి ఈనెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా ప్రాంతాల పరిధిలోని బార్లు, ఎలైట్ బార్లు, క్లబ్‌లు, పర్యాటక స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు నిబంధనల మేరకు అన్ని అనుమతులతో ఆహార పదార్థాలను అందజేసే సంస్థలు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. టీసీయూఆర్ పరిధిలోని జీహెచ్‌ఎంసీతోపాటు బోడుప్పల్, జవహర్‌నగర్, ఫీర్జాదిగూడ, నిజాంపేట, బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో చేసుకునే దరఖాస్తులను నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.
మిగిలిన ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలో ఎక్కడికక్కడే ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాల్లో దరఖాస్తు ఇవ్వొచ్చు. మరో విశేషమేమిటంటే... ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎక్కడ, ఎన్ని దరఖాస్తులు వచి్చనా అన్ని మైక్రో బ్రేవరీలను మంజూరు చేస్తామని, తాము పెట్టిన నిబంధనల మేరకు అన్ని అనుమతులు ఉంటే చాలని, అయితే ఏడాదికి రూ.5 లక్షల లైసెన్సు ఫీజును చెల్లించాల్సి ఉంటుందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.