ఉల్లి ఘాటు!

Gradually Rising Onion Prices In the Open Market - Sakshi

బహిరంగ మార్కెట్‌లో క్రమంగా పెరుగుతున్న ధరలు

గ్రేడ్‌–1 ధర నెల రోజుల్లోనే రెట్టింపు.. ప్రస్తుతం కిలో రూ.40 

మహారాష్ట్ర, కర్ణాటక, కర్నూలు నుంచి తగ్గుతున్న సరఫరా 

వారం కింద సరఫరా 5,479 క్వింటాళ్లు.. ప్రస్తుతం 2,400 క్వింటాళ్లే 

రాష్ట్రీయంగా సరఫరా అయ్యే ఉల్లి 8,719 క్వింటాళ్ల నుంచి 1,600 క్వింటాళ్లకు తగ్గుదల 

ధరల పెరుగుదల దృష్ట్యానే ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం..అవసరమైతే నిల్వలపైనా ఆంక్షలు!

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా మళ్లీ ఉల్లి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. నెల రోజులుగా తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉల్లి సాగు గణనీయంగా చేస్తున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాల్లో పంటలు దెబ్బతినడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనే నెల రోజుల కిందటితో పోలిస్తే ధర రెట్టింపయ్యింది. కిలో రూ.40 మేర పలుకుతోంది. పొరుగు నుంచి రావాల్సిన సరఫరా సగానికి తగ్గడమే ధరలు పెరగడానికి కారణమని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో విదేశాలకు ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఉల్లి ధరల నియంత్రణకు అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకునేందుకు కూడా కేంద్రం సిద్ధమవుతోంది.  

పంట నష్టంతో పెరిగిన ధరలు.. 
రాష్ట్రంలో ఉల్లి పంటల సాగు తక్కువే. ఆలంపూర్, గద్వాల, వనపర్తి, కొల్లాపూర్, నారాయణఖేడ్‌ ప్రాంతాల్లోనే సాగు ఎక్కువ. ఇవి రాష్ట్ర అవసరాలు తీర్చే అవకాశం లేకపోవడంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నుంచి దిగుమతి అయ్యే ఉల్లిపైనే ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటోంది. గత ఏడాది వర్షాలకు పంట దెబ్బతినడంతో దేశ వ్యాప్తంగా కిలో ఉల్లి ధర రూ.160కి చేరింది. తెలంగాణలో గరిష్టంగా రూ.170కి విక్రయాలు జరిగాయి. దీంతో గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించడం, యాసంగిలో ఉల్లి సాగు గణనీయంగా పెరగడంతో ధరల నియంత్రణ సాధ్యమైంది. దేశంలో లాక్‌డౌన్‌ విధించే నాటికి కిలో ఉల్లి ధర రూ.10–15కి మధ్యకి చేరింది. లాక్‌డౌన్‌ సమయంలోనూ కూరగాయల ధరలు పెరిగినా ఉల్లి ధర మాత్రం కిలో రూ.20 దాటలేదు. అయితే కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీల్లో.. ఆగస్టు నుంచి కురుస్తున్న వర్షాలతో పంటలు మళ్లీ దెబ్బతిన్నాయి. దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో నెల రోజుల కింద బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.15–20 పలికిన ధర ప్రస్తుతం రూ.35–40కి చేరింది. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రాల నుంచి సరఫరా క్రమంగా తగ్గుతోంది.

ఈ నెల 7న పొరుగు నుంచి 5,479 క్వింటాళ్ల గ్రేడ్‌–1 ఉల్లి్ల బోయిన్‌ పల్లి మార్కెట్‌కు రాగా, అది 12వ తేదీ నాటికి 3,424 క్వింటాళ్లు, 14న 2,835 క్వింటాళ్లు, 15న మంగళవారం 2,400 క్వింటాళ్లకు తగ్గింది. ఇక, రాష్ట్రీయంగా వచ్చే గ్రేడ్‌–2 ఉల్లి సైతం ఈ నెల 7న 8,719 క్వింటాళ్ల మేర రాగా, అది 12న 5,136, 14 నాటికి 4,252, 15న 1,600 క్వింటాళ్లకు పడిపోయింది. 15 రోజుల కిందట గ్రేడ్‌–1 ఉల్లి ధర హోల్‌సేల్‌లో క్వింటాల్‌కు రూ.1300–1500 ఉండగా, అది ఇప్పుడు రూ.30వేలకు చేరింది. మంగళవారం బోయిన్‌ పల్లిలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మేలు రకం ఉల్లి ఏకంగా క్వింటాకు రూ.3,600 పలికింది. రాష్ట్రీయంగా వస్తున్న ఉల్లి సైతం ఈ నెల ఒకటిన హోల్‌సేల్‌లో క్వింటాకు రూ.700–800 ఉండగా, అది ఇప్పుడు రూ.2000కు చేరింది. ఈ ధరలకు అనుగుణంగా బహిరంగ మార్కెట్‌లో ధర కిలో రూ.20 నుంచి రూ.40కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రానికి సరఫరా తగ్గుతున్న క్రమంలో ధరల్లో పెరుగుదల ఉండవచ్చని మార్కెటింగ్‌ శాఖ వర్గాలు చెబుతున్నాయి.  

ఎగుమతులపై నిషేధం.. 
రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం గత ఏడాది మాదిరి ధరలు పెరగకుండా నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టింది. విదేశాలకు ఉల్లి ఎగమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీఎఫ్‌టీ) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం నిర్ణయంతో బంగ్లాదేశ్, శ్రీలంకలకు ఉల్లి ఎగుమతులు తక్షణమే నిలిచిపోతున్నాయి. ఇక ధరల పెరుగుదలను బట్టి ఉల్లి నిల్వలపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ధరలు భారీగా పెరిగితే వినియోగదారులకు ఉపశమనం కల్పించేందుకు 50 వేల టన్నుల బఫర్‌ స్టాక్‌ను కేంద్రం దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉంచే అవకాశాలను పరిశీలిస్తోందని ఆ వర్గాలు చెబుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top