ఎస్సీ అభివృద్ది శాఖలో గ్రేడ్–1 హెచ్‌డబ్ల్యూఓల ఆందోళన
అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రమోషన్లలో రెండు దశాబ్దాలుగా జాప్యం
కోర్టు తీర్పు ఇటీవల వచ్చినా అమలు చేయని కమిషనరేట్
తాజాగా గ్రూప్–2 నియమితుల కంటే జూనియర్లుగా మారిన దుస్థితి
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ అభివృద్ధి శాఖలో వసతిగృహ సంక్షేమాధికారి (హెచ్‌డబ్ల్యూఓ) గ్రేడ్–1 కేటగిరీ అధికారుల పదోన్నతులపై ప్రతిష్టంభన తొలగట్లేదు. అర్హతలున్నప్పటికీ వారిని సహాయ సాంఘిక సంక్షేమాధికారి (ఏఎస్‌డబ్ల్యూఓ)గా పదోన్నతి ఇవ్వట్లేదు. దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తున్నా కనీస పదోన్నతి కల్పించకపోవడంపై ఆయా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
అర్హతలున్న పలువురు హెచ్‌డబ్ల్యూఓలు ఏడాదిన్నరగా పదవీ విరమణ పొందుతున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సంక్షేమశాఖలన్నింట్లోనూ హెచ్‌డబ్ల్యూఓ పోస్టుల్లో అందరూ ఏకకాలంలో నియమితులైనప్పటికీ బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖల్లోని అధికారులు జిల్లాస్థాయి అధికారి హోదా పదోన్నతి పొందగా ఎస్సీ అభివృద్ధి శాఖలో మాత్రం అదే కేడర్‌లో హెచ్‌డబ్ల్యూఓలుగానే మిగిలిపోయారు.
తాజాగా గ్రూప్–2 ఉద్యోగ నియామకాలు పూర్తవగా పలువురు ఏఎస్‌డబ్ల్యూఓలుగా ఎస్సీ అభివృద్ధి శాఖలో నియమితులై విధుల్లో చేరారు. కానీ ఏళ్లు గడుస్తున్నా సీనియర్ హెచ్‌డబ్ల్యూఓలకు పదోన్నతులు ఇవ్వకపోవడంతో కొత్తగా ఉద్యోగాల్లో కొలువుదీరిన వారి కంటే జూనియర్లుగా మిగిలిపోయామంటూ మండిపడుతున్నారు.
జాడలేని సీనియారిటీ జాబితా...
సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ పదోన్నతులు, నేరుగా నియామకాలు (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) పద్ధతిలో జరుగుతుంది. 30 శాతం ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తే 70 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. ఎస్సీ అభివృద్ధి శాఖలోనూ ఏఎస్‌డబ్ల్యూఓ పోస్టులను హెచ్‌డబ్ల్యూఓ (గ్రేడ్–1) అధికారులకు పదోన్నతులు ఇచ్చి భర్తీ చేయాలి.
కానీ దాదాపు రెండు దశాబ్దాలుగా పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. శాఖాపరమైన పదోన్నతులకు నిర్ణయం తీసుకొనే డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్స్ కమిటీ ఐదేళ్లుగా కనీసం భేటీ కాకపోవడం గమనార్హం. కోర్టు కేసును సాకుగా చూపుతూ పదోన్నతుల ప్రక్రియను కొంతకాలంగా వాయిదా వేస్తూ వచ్చారు. ఈ కేసులో మూడేళ్ల క్రితమే కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ దాన్ని ప్రభుత్వం అమలు చేయట్లేదని పలువురు హెచ్‌డబ్ల్యూఓలు చెబుతున్నారు.
పదోన్నతులు కల్పించాలంటే ముందుగా సీనియారిటీ జాబితా రూపొందించాలి. ఇందుకుగాను ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న హెచ్‌డబ్ల్యూఓ (గ్రేడ్–1) సీనియారిటీ జాబితాను వెల్లడించాలి. కానీ ఈ దిశగా ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనరేట్ చర్యలు చేపట్టట్లేదు. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం లేదని అధికారులు చెబుతున్నారు. సంబంధిత మంత్రితోపాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఎస్సీ అభివృద్ధి శాఖ ఇటీవల హడావుడిగా ప్రాథమిక సీనియారిటీ జాబితాను బహిర్గతం చేసింది.
దీనిపై అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు... నాలుగు నెలలు గడిచినా నిర్ణయం తీసుకోలేదు. కాగా, సీనియారిటీ జాబితాను జోనల్ స్థాయిలో రూపొందించాల్సి ఉండగా కేవలం జిల్లా స్థాయిలో రూపొందించుకోవాలని పేర్కొనడం ఇప్పుడు హెచ్‌డబ్ల్యూఓల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తోంది.


