
ఆదాయానికి మించి ఆస్తులు జమ
17 మంది ఇంజినీర్లపై సీఎంఓ ఆరా
సాక్షి, హైదరాబాద్: ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అక్రమాలకు పాల్పడినట్లు తేలితే.. పనిష్మెంట్ కింద అతడిని పాతబస్తీ వంటి క్లిష్టమైన ప్రాంతాలకు పంపుతుంటారు. మెజార్టీ ఉద్యోగులు కూడా ఇక్కడ విధులను పనిష్మెంట్‌లో భాగమే అనుకుంటారు. ఇష్టం లేకపోయినా.. విధులు నిర్వర్తిస్తుంటారు. కానీ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇంజినీర్లు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. సంస్థలో ఫోకల్ (దండిగా ఆదాయం వచ్చే ప్రాంతాలు), నాన్ ఫోకల్ (నష్టాలతో పాటు ఆదాయం పెద్దగా లేని ప్రాంతాలు) అంటూ రెండు భిన్నమైన పోస్టులను సృష్టించారు.
తరచూ అక్రమాలకు పాల్పడుతూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజినీర్లను శాఖపరంగా శిక్షించకపోగా వారికి మరింత ఆదాయాన్ని సమకూర్చి పెట్టే పోస్టులను కట్టబెడుతున్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధతతో పని చేసే అధికారులను ఏళ్లుగా నాన్ ఫోకల్ పోస్టులకే పరిమితం చేస్తున్నారు. ఆర్థిక, రాజకీయ అండదండలు లేకపోవడంతో చేసేది లేక వారు కూడా రొటీన్ విధులకు అలవాటు పడిపోతున్నారు.
సీఎంఓకు చేరిన జాబితా
గ్రేటర్ జిల్లాల పరిధిలో మెట్రోజోన్, రంగారెడ్డిజోన్, మేడ్చల్ జోన్లు ఉన్నాయి. వీటి పరిధిలో తొమ్మిది సర్కిళ్లు, 26 డివిజన్లు, 65 ఆపరేషన్ సబ్ డివిజన్లు, 213 ఆపరేషన్ సెక్షన్లు ఉన్నాయి. ప్రతి మూడేళ్ల కోసారి ఆయా ఇంజినీర్లను ఒక చోట నుంచి మరో చోటికి బదిలీ చేస్తుంటారు. నిజానికి మూడేళ్లు ఫోకల్ పోస్టులో కొనసాగిన ఇంజినీర్లను, ఆ తర్వాతి బదిలీల్లో నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాల్సి ఉంది. కానీ డిస్కంలో నిబంధనలకు విరుద్ధంగా ఫోకల్ పోస్టుల్లో పని చేసిన ఇంజనీర్‌కు మళ్లీ మరో ఫోకల్ పోస్టును కట్టబెడుతున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతూ కొందరు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడుతుండగా, మరి కొంత మంది తప్పించుకు తిరుగుతున్నారు.
ఇలా ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో ఫోకల్ టు ఫోకల్ పోస్టులు పొంది ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఇంజినీర్లు జాబితాపై సీఎంఓ ఆరా తీసినట్లు సమాచారం. ఇబ్రహీంబాగ్, గచ్చిబౌలి, మేడ్చల్, రాజేంద్రనగర్, కందుకూరు డివిజన్ల పరిధిలో పని చేసిన వారిలో ఎక్కువశాతం ఫోకల్ టు ఫోకల్ పోస్టుల్లోనే పని చేసినట్లు గుర్తించింది. విజిలెన్స్ విభాగం 17 మందితో రూపొందించిన ఓ జాబితా రెండు రోజుల క్రితమే సీఎంఓకు చేరినట్లు సమాచారం. వీరిలో ఏడీఈ స్థాయి మొదలు.. ఓ సీఈ స్థాయి అధికారి కూడా ఉన్నట్లు తెలిసింది. దీనిపై సీఎం స్వయంగా ఆరా తీస్తుండటంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత మూడు రోజులుగా ఆయా అధికారులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.
ఆ మూడు డివిజన్లే కీలకం
హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ సెంట్రల్, బంజారాహిల్స్ సర్కిళ్లు, డివిజన్లు, సబ్ డివిజన్లు, సెక్షన్ల పరిధిలో ఖాళీ స్థలాలు పెద్దగా లేకపోవడంతో కొత్త కనెక్షన్లకు అంచనాలు కూడా పెద్దగా ఉండవు. విద్యుత్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ, అంతరాయాల పునరుద్ధరణ, నెలవారి బిల్లుల జారీ, వసూళ్లపై దృష్టి మినహా ఇతర పనులు లేకపోవడంతో ఆశించిన స్థాయిలో అదనపు ఆదాయం కూడా ఉండదు. దీంతో ఆయా డివిజన్లు, సబ్‌డివిజన్లు, సెక్షన్లలో పోస్టులకు ఇంజినీర్లు పెద్దగా ఆసక్తి చూపరు.
ఇక రంగారెడ్డిజోన్ పరిధిలోని సైబర్‌సిటీ, సరూర్‌నగర్, రాజేంద్రనగర్ సర్కిళ్లలో హైరేజ్ భవనాలు, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, ఐటీ అనుబంధ సంస్థలు, పారిశ్రామిక వాడలు ఎక్కువ. ఇక మేడ్చల్ జోన్‌లో సికింద్రాబాద్, హబ్సీగూడ, మేడ్చల్ సర్కిళ్లు ఉన్నాయి. కొండాపూర్, గచ్చిబౌలి, ఇబ్రహీంబాగ్ సహా రాజేంద్రనగర్, కందుకూరు, షాద్‌నగర్, సరూర్‌నగర్, చంపాపేట్, ఇబ్రహీం పట్నం, మేడ్చల్ కీసర, జీడిమెట్ల డివిజన్లు పూర్తిగా ఫోకల్ పోస్టులుగా పేర్కొంటారు. కోర్‌సిటీతో పోలిస్తే శివారు ప్రాంతాల్లో కొత్తగా విద్యుత్ లైన్ల విస్తరణ, ఎస్టిమేషన్లు, భూగర్భ కేబుల్ పనులు, కనెక్షన్లు, మీటర్ల జారీ వంటివి ఇంజినీర్లకు కాసుల వర్షం కురిపిస్తుండటంతో ఇక్కడ పోస్టింగ్‌ల కోసం ఇంజనీర్లు అడ్డదారులు తొక్కుతుంటారు. ఉన్నాతాధికారులు, రాజకీయ ప్రముఖులకు భారీగా ముడుపులు ముట్టజెప్పి కోరుకున్న పోస్టును దక్కించుకుంటారు.
ఇలా సర్వీసు అంతా ఫోకల్ పోస్టుల్లోనే కొనసాగిన వారిపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందినా..చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి ‘పెద్ద’ల అండదండలతో తప్పించుకు తిరుగుతున్న అనకొండల జాబితా సీఎంఓకు చేరినట్లు తెలిసింది. ఏ క్షణమైనా ఆయా అక్రమార్కుల ఇళ్లపై దాడులు చేసే అవకాశం లేకపోలేదనే ప్రచారంతో వారంతా ఇప్పటికే బ్యాంకు లాకర్లలో దాచిన స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలు సహా భారీగా కూడబెట్టిన నగదును రహస్య ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.