
అంబర్‌పేట: కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ టి.మనీషా ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒప్పందం ప్రకారం రెండోవిడత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ సంఘటన సోమవారం జీహెచ్‌ఎంసీ సర్కిల్–16 పరిధిలోని గోల్నాక వార్డు కార్యాలయంలో చోటు చేసుకుంది.
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..మనీషా సర్కిల్ పరిధిలో నల్లకుంట డివిజన్ ఏఈగా కొంత కాలం పని చేసి ప్రస్తుతం గోల్నాక డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. డివిజన్ పరిధిలోని ఓ అభివృద్ధి పనిని కాంట్రాక్టర్ దక్కించుకుని పూర్తి చేశాడు. దాని బిల్లు కోసం సదరు కాంట్రాక్టర్ ఏఈని అడుగగా ఆమె రూ.15 వేలు లంచం డిమాండ్ చేసింది. దీంతో కాంట్రాక్టర్ మొదటి విడతగా రూ.5 వేలు ఇచ్చాడు. రెండో విడత అందించేందుకు ముందు అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
వారి సూచన మేరకు సోమవారం గోల్నాక వార్డు కార్యాలయంలో ఏఈకి డబ్బులు అందించాడు. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏఈ మనీషా ఏసీబీకి పట్టుబడక మందు అభివృద్ధిపై ఎమ్మెల్యే నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సమీక్షా సమావేశం పూర్తి కాకముందే అనుమతి తీసుకుని బయటకు వచ్చి ఏసీబీకి పట్టబడడం గమనార్హం.