బియ్యం అక్రమార్కులకు పెద్దల అండ!

GadWal District Rekha Rice Mill Irregularities Scam - Sakshi

గద్వాల జిల్లాలోని రేఖ మిల్లు బాగోతంలో మరో కోణం  

జిల్లాస్థాయి అధికారి, ఇతర నిందితులకు ఓ ప్రజాప్రతినిధి, ఓ రాష్ట్ర అధికారి అండ   చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగంపై మరో వర్గం ఒత్తిడి  

అందుకే కేసు నమోదు.. కింది స్థాయి ఉద్యోగి బలి   గద్వాల జిల్లాలో నేతల ఆధిపత్య పోరుతో కలవరం 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: జోగుళాంబ గద్వాల జిల్లాలోని రేఖ రైస్‌ మిల్లు అక్రమాల్లో భాగస్వాములైన అధికారులకు రాష్ట్రస్థాయిలో ఓ ఉన్నతాధికారి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాపతినిధి అండగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అందువల్లే గత ఏడాది డిసెంబర్‌లో విచారణ నివేదిక అందినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది. అయితే గద్వాల టీఆర్‌ఎస్‌ పార్టీలో మూడు వర్గాలు ఉండగా.. ఓ వర్గం నేతలు జిల్లాస్థాయి అధికారికి మద్దతు ఇస్తున్నారని, మరో వర్గం తటస్థంగా ఉందని తెలిసింది. వారికి పోటీగా ఉండే ఇంకో వర్గం నేతలు రేషన్‌ అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ యంత్రాంగంపై ఇటీవల తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. దీని కారణంగానే ఒకరిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులు చెప్తున్న వివరాలు కూడా ఈ ప్రచారాన్ని బలపరుస్తున్నాయి. 

ఒకరిపై కేసు నమోదుకు ఆదేశాలు 
‘‘రేఖ రైస్‌మిల్లులో పట్టుబడిన 170.05 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం విషయంలో రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. అధికారులను తప్పుదోవ పట్టించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్‌ గణపతిరావుపై కేసు నమోదు చేయాలని చెప్పారు. ఈ మేరకు గద్వాల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం’’అని ఇన్‌చార్జి డీఎస్‌ఓ రేవతి తెలిపారు. ఈ ఘటనతో సంబంధమున్న ఇతర అధికారులపై చర్యలకు సంబంధించి పైనుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని వివరించారు. ఈ లెక్కన రాష్ట్ర విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదిక బుట్టదాఖలైనట్టేనా? అందులో పేర్కొన్న అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ), మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ఇన్‌చార్జి తహసీల్దార్, సీఐ, ఎస్సైలపై చర్యలుంటాయా.. లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

‘రేషన్‌’ బియ్యం వ్యవహారం ఇదీ.. 
2020 అక్టోబర్‌ 2న గద్వాల శివారులోని రేఖ రైస్‌ మిల్లులో రేషన్‌ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్టు స్థానిక పోలీసులకు పక్కా సమాచారం అందింది. రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు ఆ మిల్లులో సోదాలు నిర్వహించారు. 341 సంచుల్లో (170.05 క్వింటాళ్లు) రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించి సీజ్‌ చేశారు. కానీ మిల్లు యాజమాన్యంతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారు. పట్టుబడినది రేషన్‌ బియ్యం కాదంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్‌ ఎల్‌.గణపతిరావు తప్పుడు నివేదిక రూపొందించి బురిడీ కొట్టించాడు. దీనిపై అప్పట్లో పోలీస్, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గతంగా వివాదం చెలరేగింది. ఈ విషయం బయటికి రావడంతో రాష్ట్రస్థాయి విజిలెన్స్‌ బృందం రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. మిల్లులో సీజ్‌ చేసిన బియ్యాన్ని ల్యాబ్‌కు పంపగా రేషన్‌ బియ్యమేనని తేలింది. దీంతో పూర్తిస్థాయిలో ఆరా తీశారు. రేఖ మిల్లులో బియ్యం పట్టుబడ్డ రోజు గణపతిరావు విధుల్లోనే లేరని, తప్పుడు అనుమతి పత్రాలను రూపొందించి అధికారులకు ఇచ్చారని గుర్తించారు. ఈ వ్యవహారంలో అప్పటి గద్వాల అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)తోపాటు మరో ఐదుగురి హస్తం ఉన్నట్టు తేల్చి గత ఏడాది డిసెంబర్‌లోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇన్నాళ్లూ ఆ నివేదిక మూలనపడగా.. తాజాగా గత నెల 21న గద్వాల పట్టణ పోలీసు స్టేషన్‌లో డీటీ గణపతిరావుపై కేసు నమోదు చేశారు. ఈ దందాపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top