గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌

Gadchiroli Firing Between Police And Naxals - Sakshi

ఐదుగురు మావోల మృతి 

ఉలిక్కిపడిన తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దు 

తప్పించుకున్న మావోయిస్టుల కోసం అదనపు బలగాలు 

కాళేశ్వరం: హోలీనాడు మూడురాష్ట్రాల సరిహద్దుల్లో గోలీమార్‌ కొనసాగింది. మైదాన ప్రాంతం రంగులమయం కాగా, అటవీప్రాంతం మావోయిస్టుల రక్తంతో ఎరుపెక్కింది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరోలీ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సందీప్‌ పాటిల్‌ తెలిపిన వివరాల ప్రకారం... టీసీవోసీ వారోత్సవాల్లో భాగంగా ఖేద్రమెండ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారని ఎస్పీ అంకిత్‌ గోయల్‌కు సమాచారం అందింది.

దీంతో అదనపు పోలీస్‌ సూపరింటెండెంట్‌ మనీష్‌ కల్వానియా నేతృత్వంలో గడ్చిరోలీ జిల్లాకు చెందిన సీ–60 విభాగం పోలీసు బలగాలు రెండు రోజులుగా కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. సోమవారం ఉదయం ఖుర్కేడా పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని మలెవాడ పోలీస్‌ క్యాంపు సమీపంలో గల ఖేద్రమెండ అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. వెంటనే మావోయిస్టులు కాల్పులు జరపడంతో బలగాలు సైతం ఎదురు కాల్పులకు దిగాయి.  ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు.  

మృతులు వీరే... 
ఎదురుకాల్పుల్లో చనిపోయిన మావోయిస్టులు మహారాష్ట్రకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరిలో దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు పవన్‌ అలియాస్‌ భాస్కర్‌ రుషి రోజీ హిచ్చామీ (రూ.25 లక్షల రివార్డు), తిప్పాఘర్‌ ఏరియా కమిటీ సభ్యుడు సుఖ్‌దేవ్‌రాజ్‌ అలియాస్‌ బుద్దాసింగ్‌ నేతం(రూ.10 లక్షలు), ఏవోపీ సభ్యురాలు అస్మిత అలియాస్‌ యోగితా సుక్లు పాడా(రూ.4 లక్షలు), బస్తర్‌ ఏరియా కమిటీ సభ్యుడు అమర్‌ ముంగ్యా కుంజం(రూ.2 లక్షలు), ధాంరాంచ ఎస్‌పీఎస్‌ సభ్యురాలు సుజాత అలియాస్‌ కమల అలియాస్‌ పునీత చిక్రుగౌడ(రూ.2 లక్షలు) ఉన్నారు.


పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, ఇతర సామగ్రి  

ఘటనాస్థలం నుంచి ఒక ఏకే 47, ఒక 303 రైఫిల్, ఒక 12(ట్వల్‌) బోర్‌ తుపాకీతోపాటు మరో ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు పెద్దఎత్తున విప్లవ సాహిత్యం, మందులు, మందుగుండు సామగ్రి, తూటాలు లభించాయి.  తప్పించుకున్నవారి కోసం అదనపు బలగాలు ఈ ఘటనలో తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు అదనపు బలగాలను తరలించి కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. దీంతో మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్‌– తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంత గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం కూడా ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న హెటకల్సా ప్రాంతంలోనూ గంటన్నరపాటు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పాల్గొన్న సుమారు 70 మంది మావోయిస్టులు బలగాలపైకి కాల్పులు జరుపుకుంటూ దండకారణ్యంలోకి పారిపోయారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top