
నీలగిరిలో సందడి చేస్తున్న ఫ్రాన్స్ దేశస్తుడు
వారం రోజులుగా స్థానిక ప్రజలతో మమేకం
నిత్యం జాతీయ గీతాలాపన.. ధ్యానం, యోగా
భారతీయ ఆహారం, సంస్కృతిపై మక్కువ చూపుతున్న ఆడ్రిన్
నాకు నల్లగొండ ఎంతో నచ్చింది అంటున్నాడు ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆడ్రిన్. వారం క్రితం నల్లగొండకు వచ్చిన ఆయన శివాజీనగర్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉంటూ వివిధ ప్రదేశాల్లో సందడి చేస్తున్నాడు. ఇక్కడి వారితో కలిసిపోయి అందరితో సరదాగా గడుపుతున్నాడు. శనివారం ఆయనను ‘సాక్షి’ పలకరించగా.. దేశ పర్యటన విశేషాలను పంచుకున్నాడు. వివరాలు ఆయన మాటల్లోనే..
రామగిరి(నల్లగొండ) : నాకు పర్యటనలు అంటే ఎంతో ఇష్టం. ఎంఎస్ కార్పొరేట్ ఫైనాన్స్ పూర్తి చేసిన నేను ఫ్రాన్స్ రైల్వేస్‌లో డేటా మేనేజర్‌గా పని చేస్తున్నాను. 2011లో మొదటిసారి ఢిల్లీలోని భీంటెక్ కంపెనీకి స్టడీ ఎక్ఛ్సేంజ్ కార్యక్రమానికి ఇండియా వచ్చాను. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు నాకు ఎంతో నచ్చాయి. ఇప్పటికి ఎనిమిది సార్లు ఇండియాలో పర్యటించాను. నేపాల్ దేశాన్ని కూడా సందర్శించాను. ఇండియాలోని 14 రాష్ట్రాలు తిరిగాను. ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రదేశాలను వీక్షించాను. ఇక్కడి హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, లడక్, టిబెట్ అంటే నాకు ఎంతో ఇష్టం.
ధ్యానం ఇష్టం
ఈ ఏడాది జూలైలో ఢిల్లీకి వచ్చాను. రాజస్థాన్‌లోని జైపూర్, లడక్, కార్గిల్‌ను సందర్శించాను. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాను. ఆగస్టులో హైదరాబాద్ వచ్చి.. అక్కడి నుంచి నాగార్జునసాగర్ విపాసన ధ్యాన కేంద్రానికి వెళ్లాను. వారం రోజుల పాటు అక్కడ ధ్యానంలో శిక్షణ తీసుకున్నాను. అక్కడికి వలంటీర్‌గా వచ్చిన నల్లగొండ మండలం కంచనపల్లికి చెందిన నితిన్‌తో పరిచయం ఏర్పడింది. అతని ఆహ్వానం మేరకు ఆగస్టు 17న కంచనపల్లికి వచ్చాను.
ఇండియా గొప్ప దేశం
ఇండియా గొప్ప దేశం. ఇక్కడ ప్రతి రాష్ట్రంలో ఒక విభిన్నమైన సంస్కృతి ఉంది. అనేక భాషలు మాట్లాడుతారు. పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇటీవల వెళ్లిన అమర్‌నాథ్ యాత్ర ఎంతో అనుభూతిని ఇచ్చింది. ఇండియాలో నేను ఎక్కువగా నార్త్ ఇండియా
సందర్శించాను. ఇప్పుడు మొదటిసారి సౌత్ ఇండియాకు వచ్చాను. ఇండియాలో నేర్చుకున్న ధ్యానం జీవనానికి, ఉద్యోగరీత్యా చాలా ఉపయోగపడుతుంది. హిందూ, బుద్ధిజం అంటే ఇష్టపడతాను. తీరిక సమయాల్లో రామాయణం, భగవద్గీత చదువుతాను.
నిత్య జాతీయ గీతాలాపన బాగుంది..
నల్లగొండ పట్టణం చాలా బాగుంది. వారం రోజులు ఇక్కడ గడిపాను. రోజూ ఉదయం బీజేపీ కార్యాలయంలో యోగా శిక్షణకు హాజరవుతున్నాను. ఇక్కడ అందరూ ఇష్టంగా నాతో సెల్ఫీలు దిగుతున్నారు. నల్లగొండలోని బిర్యానీ, దోశ, చాయ్ బాగున్నాయి. పానగల్ ఆలయాన్ని సందర్శించాను. కంచనపల్లి గ్రామంలో నాట్లు వేసే కూలీలతో సరదాగా గడిపాను. నాకు భారతదేశ సంస్కృతి ఎంతో ఇష్టం. నల్లగొండలో రోజూ ఉదయం జాతీయ గీతాలాపన చేయడం నాకు ఎంతో నచ్చింది. నేను కూడా భారతదేశ జాతీయ జెండా పట్టుకుని జాతీయ గీతం ఆలపించాను.