రాష్ట్రంలోని 70 అటవీ ప్రాంతాలను సినిమా షూటింగ్‌లకు గుర్తించిన అటవీశాఖ
అందులోనే హైదరాబాద్ చుట్టూ ఉన్న 52 అర్బన్ పార్కులు
ఎంచుకున్న ప్రాంతాల్లో దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే అనుమతి
రోజుకు రూ. 50 వేల ఫీజును ఎఫ్‌డీసీకి ఆన్‌లైన్‌లో చెల్లించేలా నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరానికి చుట్టుపక్కల ఉన్న అటవీశాఖకు చెందిన అర్బన్ పార్కుల్లో సినిమా షూటింగ్‌లకు లైన్ క్లియరైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీ ప్రాంతాలు, అర్బన్ పార్కుల్లో సినిమాల చిత్రీకరణకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ పార్కుల్లోని ప్రకృతి శోభ, పచ్చటి అందాలు సినిమాల్లో కనువిందు చేయనున్నాయి. సినిమా చిత్రీకరణలకు అనువుగా ఉన్న 70 అటవీ ప్రాంతాలను షూటింగ్ స్పాట్లుగా ఎంపిక చేశారు.
అందులో హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కల ఉన్న 52 అర్బన్ పార్కులు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి అటవీశాఖ అధికారులు, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రతినిధుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఆయా అంశాలపై స్పష్టత వచ్చాక అర్బన్ పార్కుల్లో సినిమాల చిత్రీకరణకు అటవీశాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. సినిమా షూటింగ్‌జరుపుకునేందుకు గుర్తించిన స్పా ట్లు చిత్రీకరణలకు అనుకూలంగా ఉన్నా యా లేదా అన్న అంశాలను పరిశీలించారు.
చిలుకూరు ట్రెక్‌పార్కు మొదలు కిన్నెరసాని జింకల పార్కు దాకా...
రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని అటవీ శాఖ నిర్ణయించిన పార్కులు, ప్రదేశాల్లో...చిలుకూరు ఫారెస్ట్ ట్రెక్‌పార్కు, మృగవని నేషనల్ పార్కు, బీఎన్‌రెడ్డి నగర్ ఆరోగ్యసంజీవని,, మహావీర్ హరిణ వనస్థలి, పాలపిట్ట సైక్లింగ్ పార్క్, మహబూబ్‌నగర్‌లోని మయూరి హరితవనం, కవ్వాల్, అమ్రాబాద్ పులుల అభయారణ్యాలు, కిన్నెరసాని జింకల పార్కు తదితరాలున్నాయి.
అయితే సినిమా షూటింగ్స్ నిర్వహించేందుకు ఎంపిక చేసుకున్న అర్బన్ పార్కుల్లో అనుమతి కోసం నిర్మాతలు దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించి ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) 24 గంటల్లో అనుమతి ఇస్తుంది. దరఖాస్తు చేసుకున్నాక కూడా ఏదైనా కారణం వల్ల అనుమతి లభించడానికి ఆలస్యమైనా కూడా ముందు నిర్ణయించుకున్న తమ షెడ్యూల్ ప్రకారం సినీ యూనిట్స్ షూటింగ్స్ జరుపుకునే అవకాశం కల్పించనున్నారు.
అర్బన్ పార్కుల్లో ఒకరోజు షూటింగ్ జరుపుకునేందుకు రూ. 50 వేల ఫీజును ఎఫ్‌డీసీకి ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా ఆయా పార్కుల్లోనూ పర్యాటకుల సందడి పెరిగితే అటవీశాఖకు మంచి ఆదాయం కూడా సమకూరుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో సినీరంగ అభివృద్ధికి కావాల్సిన అనుమతులను సింగిల్ విండో ద్వారా అందించనున్నట్టు సమా చారం.ప్రత్యేకంగా దీని కోసం ప్రభుత్వం ‘ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ’పేరుతో ఓ వెబ్‌సైట్ రూపొందించింది.
తెలంగాణలో షూ టింగ్స్, థియేటర్ల నిర్వహణకు కావాల్సిన అన్ని అనుమతులను దీని ద్వారా పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, వరంగల్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో అడవులకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే.


