Telangana VROs: ఇతర శాఖల్లోకి వీఆర్వోలు, జీవో జారీ.. భగ్గుమన్న జేఏసీ నేతలు

Finance Department Permission To Adjust VROs In Government Departments - Sakshi

5,385 మందిని సర్దుబాటు (విలీనం) చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను ఇప్పటికే గుర్తించిన జిల్లా అధికారులు 

లాటరీ ద్వారా నియామకం.. ఈ బాధ్యత కలెక్టర్లకు అప్పగింత 

ఖాళీల కన్నా ఎక్కువగా ఉంటే పొరుగు జిల్లాలకు...

జీవో 121ను దహనం చేసిన వీఆర్వోల జేఏసీ 

కోర్టుకు వెళ్తామంటున్న వీఆర్వోలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వోల) శకం ముగిసింది. రెవెన్యూ శాఖను పర్యవేక్షించే భూపరిపాలన విభాగంలో వీఆర్వోలుగా పనిచేస్తున్న 5,385 మందిని ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు (విలీనం) చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో వీఆర్వోలుగా పనిచేస్తున్న వారిని వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ సమాన హోదాలో సర్దుబాటు చేయనున్నారు.

ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించే బాధ్యతను జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం జీవో నంబర్‌ 121ను విడుదల చేశారు. 2020లో అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం వీఆర్వోల వ్యవస్థ రద్దయినందున.. ఆ పోస్టుల్లోని సిబ్బందిని ఇతర శాఖల్లోకి తీసుకోనున్నట్టు అందులో తెలిపారు.

ఇప్పటికే ఆయా జిల్లాల ప్రభుత్వ యంత్రాంగం గుర్తించిన ఖాళీల్లో వారిని సర్దుబాటు చేయాలని, లాటరీ తీసి ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రెవెన్యూ శాఖ ఇచ్చే సర్వీస్‌ రిజిస్టర్, తాజా పే సర్టిఫికెట్‌ ఆధారంగా ప్రభుత్వ శాఖలు వారిని చేర్చుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం సెలవు, సస్పెన్షన్, డిప్యుటేషన్, ఫారిన్‌ సర్వీసులో ఉన్న వీఆర్వోలను కూడా ఇతర శాఖలకు పంపాలని ఆదేశించారు. 

అదనంగా ఉంటే పొరుగు జిల్లాలకు.. 
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ఆర్థికశాఖ ప్రతి జిల్లాకు ఓ ఉత్తర్వును జారీ చేసింది. సదరు జిల్లాల్లో గుర్తించిన ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను విభాగాల వారీగా ప్రకటిస్తూ.. ఎంతమంది వీఆర్వోలను సర్దుబాటు చేయాలో పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్‌ రాస్‌ మెమో నంబర్‌: 1634052–బీ/186/ఏ1/హెచ్‌ఆర్‌ఎం–7/2022 పేరిట అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్‌ పంపారు. లాటరీ ప్రక్రియను వీడియో తీయాలని.. నిర్దేశిత ఫార్మాట్‌లో ఉద్యోగుల కేటాయింపు ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లే ఇవ్వాలని సూచించారు. ఏదైనా జిల్లాలో గుర్తించిన ఖాళీల కంటే వీఆర్వోల సంఖ్య ఎక్కువగా ఉంటే పొరుగు జిల్లాలకు పంపాలని ఆదేశించారు. 

భూపరిపాలన మినహా.. 
జిల్లాల వారీగా ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలిస్తే.. వీఆర్వోలను ఎక్కువగా నీటి పారుదల, పంచాయతీరాజ్, విద్య, వైద్య శాఖలకు కేటాయించారు. జిల్లాల్లో హెచ్‌వోడీల పరిధిలోకి వచ్చే విభాగాల్లోని ఖాళీల్లో వీఆర్వోలను సర్దుబాటు చేయాలన్నారు. దేవాదా య, ఎక్సైజ్‌, పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖల్లోకి కూడా వీరిని తీసుకునేందుకు అనుమతినిచ్చిన ఆర్థిక శాఖ.. భూపరిపాలన విభాగంలోకి తీసుకునేందుకు అనుమతించలేదు. 

జీవో నం 121 ప్రతి దహనం
తమను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడంపై వీఆర్వోల సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం 121 ప్రతిని వీఆర్వో సంఘాల జేఏసీ నేతలు హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయ ప్రాంగణంలో దహనం చేశారు. వీఆర్వోలుగా తాము ఒక్క భూపరిపాలన విధులు మాత్రమే చూడటం లేదని.. మొత్తం 54 రకాల విధుల్లో అదీ ఒకటని, తమను ఇతర శాఖలకు పంపితే మిగతా 53 విధులను ఎవరు నిర్వర్తించాలని ప్రశ్నించారు.

తమను సంప్రదించకుండా, సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ప్రకటించారు. అప్పటివరకు జిల్లా కలెక్టర్లు ఇచ్చే సర్దుబాటు ఉత్తర్వులను తీసుకోవద్దని నిర్ణయించారు. దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వీఆర్వోల జేఏసీ నేత వింజమూరి ఈశ్వర్‌ తెలిపారు. ఎక్కడో అవినీతి జరిగిందనే సాకుతో వ్యవస్థనే రద్దు చేయడం దారుణమన్నారు. 

ముందు కేడర్‌ స్ట్రెంత్‌ నిర్ధారించండి: ట్రెసా 
వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసే ప్రక్రియను ప్రారంభించడంపై తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) అసంతృప్తి వ్యక్తం చేసింది. రెవెన్యూ శాఖ 6,874 పోస్టులను కోల్పోతోందని ట్రెసా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగా రవీందర్‌రెడ్డి, కె.గౌతమ్‌కుమార్‌ పేర్కొన్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దుతో తమ శాఖలో పని ఒత్తిడి పెరుగుతుందని.. పరిపాలన, ఎన్నికలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ప్రకృతి వైపరీత్యాలు, ధ్రువపత్రాల జారీ, సంక్షేమ పథకాల అమలు వంటి కార్యక్రమాలకు విఘాతం కలుగుతుందన్నారు. పాలనా సౌకర్యార్ధం ప్రతి మండలానికి ఐదుగురు అదనపు సిబ్బందిని వెంటనే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. 

రెవెన్యూశాఖను అనాథ చేశారు: టీజీటీఏ 
తెలంగాణ పాలన వ్యవస్థకు ఆయువు పట్టు అయిన రెవెన్యూ శాఖను ప్రభుత్వం అనాథను చేసిందని తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్‌ (టీజీటీఏ) పేర్కొంది. ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో ఇప్పటివరకు చెప్పలేదని టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి మండిపడ్డారు. కొత్త మండలాలు, డివిజన్లు, జిల్లాలు ఏర్పాటయ్యాక ఒక్క పోస్టునూ పెంచని ప్రభుత్వం.. ఏకంగా 6వేలకు పైగా పోస్టులను రెవెన్యూ శాఖ నుంచి తీసేయడం దారుణమన్నారు. వెంటనే జీవో 121ను రద్దు చేయాలని, లేదంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top