విద్యార్థుల ఖాతాల్లోనే డబ్బులేయండి

Fee Reimbursement Scheme For Dalit Students - Sakshi

ఎస్సీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కేంద్రంతో రాష్ట్రం 

నిబంధన పాటిస్తేనే తమ వాటా నిధులు అందజేస్తామని స్పష్టీకరణ 

త్వరగా నిర్ణయం తీసుకొని నివేదికివ్వాలని ఆదేశం 

ప్రస్తుతం కాలేజీల ఖాతాల్లోకే డబ్బులేస్తున్న రాష్ట్రం

సాక్షి, హైదరాబాద్‌: దళిత విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి సంబంధించి కేంద్రం కొత్త నిబంధన పెట్టింది. ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు సంబంధించిన ఆర్థిక సాయాన్ని విద్యా సంస్థలకు కాకుండా నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని తేల్చి చెప్పింది. అప్పడే కేంద్రం నుంచి పథకం వాటా నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఆ మేరకు ఖచ్చితమైన హామీనిస్తూ నిర్ణయం తీసుకొని కేంద్రానికి నివేదికివ్వాలని ఆదేశించింది. 

కేంద్రం వాటా 15 నుంచి 60 శాతానికి పెంపు 
పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు సంబంధించి ఉపకారవేతనాలను విద్యార్థి ఖాతాలో.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విద్యార్థి పేరిట కాలేజీ యాజమాన్యం ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అనుసరించిన ఈ పద్ధతినే రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా పాటిస్తోంది. అయితే కాలేజీ యాజమాన్యాలకు ఫీజులు ఇవ్వడాన్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆక్షేపిస్తోంది.

ఎస్సీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను నేరుగా విద్యార్థి ఖాతాకే ఫీజు నిధులు ఇవ్వాలని తాజాగా ఆదేశించింది. మరోవైపు ఎస్సీ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో కేంద్ర వాటా గతంలో 15 శాతం ఉండగా రాష్ట్రం వాటా 85 ఉండేది. అయితే గతేడాది నుంచి కేంద్రం నిధులను 60 శాతం ఇస్తోంది. రాష్ట్ర వాటా కంటే కేంద్రం వాటా ఎక్కువగా ఉన్నందున కేంద్రం నిబంధనలు అమలు చేయాలని రాష్ట్ర సర్కారుకు చెప్పింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ కార్యదర్శి ఆర్‌.సుబ్రమణ్యం శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షలో ఈ విషయం స్పష్టం చేశారు. 

కొత్త నిబంధనతో నష్టమే 
ఎస్సీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల కింద కేంద్ర, రాష్ట్రాలు ఏటా రూ.440 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం సగటున 2.3 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. కేంద్రం తాజా నిబంధనతో ఇబ్బందులొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ది శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థి ఖాతాకు ఫీజు నిధులు విడుదల చేస్తే కాలేజీ యాజమాన్యానికి చెల్లించడంలో జాప్యం జరుగుతుందని, అలాగే నిధుల విడుదలలో జాప్యం జరిగితే విద్యార్థి వ్యక్తిగతంగా చెల్లించాల్సి వస్తుందని వాదనలు వాదనలు వినిపిస్తున్నాయి. ఫీజుల విషయంలో కాలేజీలు కచ్చితత్వాన్ని పాటించే ప్రమాదం ఉందన్నారు. దీని వల్ల చివరకు డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతుందని విమర్శలూ వస్తున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top