ఆ పద్ధతిలో కూలీల సమస్యకి చెక్‌.. రూ.20 వేలు ఆదా!

Farming Couple Uses Mulching Paper Technique Reduces Labour Cost Mancherial - Sakshi

మల్చింగ్‌ పద్ధతిలో ఖర్భూజ, బీర సాగు

ఒక్కో పంటకు కూలీల ఖర్చు దాదాపు రూ.20 వేలు ఆదా 

సాక్షి,జగిత్యాల అగ్రికల్చర్‌: సాగులో కూలీల సమస్య రైతులకు ఇబ్బందిగా మారింది. సకాలంలో వ్యవసాయ పనులు చేయలేక, అనుకున్న స్థాయిలో దిగుబడులు రాక పలువురు రైతులు మధ్యలోనే పంటను వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం అలూర్‌కు చెందిన మెక్కొండ రాంరెడ్డి–లక్ష్మి దంపతులు (9666002222) మల్చింగ్‌ పేపర్‌తో కూలీల సమస్యకు చెక్‌పెట్టి మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు.

కూలీలతో ఇబ్బందులు
రాంరెడ్డి–లక్ష్మి దంపతులకు ఐదెకరాల భూమి ఉంది. వరి, మొక్కజొన్న, కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేస్తుంటారు. అయితే, ప్రతీ సీజన్‌లో కూలీలు సకాలంలో దొరక్కపోవడం, దొరికినా డబ్బులు ఎక్కువగా తీసుకుంటుండటంతో ఖర్చు పెరిగేది. దీనికి తోడు వారానికోసారి పంటలకు నీరు అందించినా నీరంతా ఆవిరి అయ్యేది. రసాయన ఎరువులు వేసినా పెద్దగా ఉపయోగంలోకి రాకపోయేది. దీంతో, పంటకు పెట్టిన పెట్టుబడి, వచ్చే ఆదాయానికి పొంతనలేకుండా పోయింది. 

ఎకరంలో మల్చింగ్‌ పేపర్‌తో..
మల్చింగ్‌ పేపర్‌ వల్ల కూలీల సమస్యకు చెక్‌ పెట్టవచ్చని తెలుసుకున్న దంపతులు, తొలుత ఎకరంలో రూ.8వేలతో మల్చింగ్‌ పేపర్‌ వేశారు. ఇందుకోసం భూమిలో రసాయన, సేంద్రియ ఎరువులు వేశారు. రోటోవేటర్‌తో దున్ని, మట్టిపెళ్లలు లేకుండా చేసి గట్లు ఏర్పాటు చేశారు. సాగు నీటి కోసం గట్లపై ముందుగా డ్రిప్‌ పైపులు అమర్చి అనంతరం మల్చింగ్‌ పేపర్‌ వేశారు.

ఖర్భూజ, బీర సాగు
మల్చింగ్‌ పేపర్‌ వేసిన తర్వాత గట్టుపై అవసరమున్న చోట రంధ్రాలు చేసి ఖర్భూజ, బీర విత్తనాలు వేశారు. మల్చింగ్‌ వేయకముందు ఎకరంలో మూడుసార్లు కలుపు తీసేందుకు కనీసం 30 మంది కూలీలకు రూ.15 వేలు ఖర్చయ్యేవి. ప్రస్తుతం కూలీల అవసరం లేకుండా పోయింది. రెండుమూడు పంటలకు వాడుకునేలా మల్చింగ్‌ను ఏర్పాటు చేశారు. కాగా, మల్చింగ్‌పై సిల్వర్‌ కోటింగ్‌ ఉండటంతో సూర్యరశ్మి తగిలి పంటలకు పెద్దగా పురుగులు, తెగుళ్లు ఆశించలేదు. అన్నిరకాల యాజమాన్య పద్ధతులు పాటించడంతో దిగుబడులు సైతం రెట్టింపు అయ్యాయని రైతులు దంపతులు పేర్కొన్నారు. ఒక్కో పంటకు కూలీలకు అయ్యే రూ.20 వేల ఖర్చును తగ్గించుకుంటున్నారు. ప్రస్తుతం మల్చింగ్‌ కింద వేసిన పంటల ద్వారా దాదాపు లక్ష వరకు ఆదాయం రావచ్చని సదరు దంపతులు చెప్పారు.

నూతన పద్ధతులతోనే ఆదాయం
సంప్రదాయ, నూతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తేనే రైతులకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మల్చింగ్‌తో ఒక్క పంటకు రూ.20 వేల వరకు ఆదా అవుతాయి. ప్రస్తుతం పంటలపై ఒకరిని చూసి మరొకరు పెడుతున్న పెట్టుబడులు రైతులను అప్పుల ఊబిలోకి నెడుతాయన్న విషయాలను గ్రహించాలి.
– మెక్కొండ రాంరెడ్డి–లక్ష్మి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top