Etela Jamuna: ఆస్తులు అమ్ముకునైనా సరే..  ఆత్మగౌరవం కోసం పోరాడతాం

Etela Rajender Wife Holds A Press Meet - Sakshi

ఈటల భార్య జమున ప్రెస్‌మీట్‌ 

ఎవరు నికార్సైన వారో ప్రజలకు తెలుసు 

తమ ఆస్తులు, కేసీఆర్‌ కుటుంబ ఆస్తులపై విచారణ జరగాలని డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌:  ‘‘సమైక్యాంధ్ర పాలనలో ఆత్మ గౌరవం తో బతికాం. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి అన్ని అవమా నాలే. అయినా భరించుకుంటూ ఇంతదాకా వచ్చాం. బం గారు తెలంగాణ కోసం, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం కోసం మా ఆస్తులు అమ్మేందుకు సిద్ధం. తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడుతాం’’అని మాజీమంత్రి ఈటల రాజేందర్‌ భార్య జమున పేర్కొన్నారు. తాము కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నామని స్పష్టం చేశారు. ఆదివారం తమ కుమారుడు నితిన్‌తో కలసి శామీర్‌పేటలోని నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబం, కేసీఆర్‌ కుటుంబ ఆస్తులపై విచారణకు సిద్ధమా అని సవాల్‌ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము పౌల్ట్రీ నడిపి  రాజేందర్‌ను ఉద్యమానికి పంపించామని జమున చెప్పారు. వంటావార్పులు, ఉద్యమంలో అరెస్టైన విద్యార్థుల బెయిల్స్‌ కోసం డబ్బులు ఎవరు ఇచ్చారో గుర్తు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. 

ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు 
బేవరేజెస్‌ కార్పొరేషన్‌ గోదాములను ఖాళీ చేయించి తమను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని జమున ఆరోపించారు. ‘‘మేం ఆస్తులు అమ్ముకుని తెచ్చుకున్న తెలంగాణ ఇదేనా? అసత్య ప్రచారాలు ఎక్కువ రోజులు నిలబడవు. ప్రభుత్వం చాలా నీచానికి పాల్పడు తోంది. మాకు లగ్జరీలు అవసరం లేదు. శ్రమ చేసి పది వేలు సంపాదించినా బతుకుతాం. కుట్రలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడేది లేదు’’అని స్పష్టం చేశారు. తాము కొనుగోలు చేసిన భూమి కంటే ఒక్క ఎకరా ఎక్కువున్నా ముక్కు నేలకు రాస్తామని.. తప్పుడు నివేదికలు ఇస్తున్న అధికారులు అలా చేస్తారా అని నిలదీశారు. ఎవరో ఇచ్చే ఫిర్యాదుల ఆధారంగా తాము లేనప్పుడు కొలతలు వేయడం ఏమిటని ప్రశ్నించారు. 

బజారుకీడ్చేందుకు కుట్రలు 
దేవరయాంజాల్, రావల్‌కోల్‌ భూముల విషయంలో తమ కుటుంబాన్ని బజారుకీడ్చాలనే ఉద్దేశంతోనే.. ప్రగతిభవన్‌ కేంద్రంగా కుట్రలకు పాల్పడుతున్నారని జమున ఆరోపించారు.  తమ కుటుంబంపై ఆరోపణలు చేయడానికి బదులు సిట్టింగ్‌ జడ్జితో విచారణకు చేయించాలని డిమాండ్‌ చేశారు. సమైక్య పాలనలో ఈటలకు ఉన్న గౌరవం ఇప్పుడు లేదని.. మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో మంత్రులు దొంగతనంగా కలుసుకునే పరిస్థితి ఉందని అన్నారు. గతంలో ఎన్ని ప్రలోభాలు, ఎన్ని బెదిరింపులు వచ్చినా లొంగలేదని.. ఇప్పుడు పోలీసులను ఇంటి చుట్టూ మోహరించడం చూస్తుంటే పాకిస్తాన్‌ సరిహ ద్దుల్లో ఉన్నట్టు అనిపిస్తోందని పేర్కొన్నారు. వకుళాభరణం కృష్ణమోహన్‌ లాంటి వారితో తమపై విమర్శలు చేయిం చడం విడ్డూరంగా ఉందని.. ప్రభుత్వం ప్రజలను కులాల వారీగా విడగొడుతోందని విమర్శించారు. ఎవరు నికార్సయిన వారో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top