గ్రిడ్‌ మిణుకు మిణుకు..!

Electric Grid Shaking Because Of Low Demand - Sakshi

కుప్పకూలిన కరెంట్‌ డిమాండ్‌.. ప్రమాదపుటంచున విద్యుత్‌ గ్రిడ్‌ 

మంగళవారం అర్ధరాత్రి రికార్డు స్థాయిలో 

2,809 మెగావాట్లకు పతనం  

గ్రిడ్‌ను పరిరక్షించేందుకు ఏర్పాటు: ట్రాన్స్‌కో సీఎండీ  

సాక్షి, హైదరాబాద్‌: ఎడతెరపి లేని భారీ వర్షాలతో రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ పతనమై గ్రిడ్‌ ప్రమాదపుటంచుల్లో మిణుకు మిణుకుమంటోంది. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు స్థాయిలో పతనమైంది. మంగళవారం అర్ధరాత్రి (11.30 గంటలకు) అత్యల్పస్థాయికి పడిపోయి 2,809 మెగావాట్లుగా రికార్డయింది. తెలంగాణలో అత్యల్ప విద్యుత్‌ డిమాండ్‌ ఇదే కావడం గమనార్హం. విద్యుత్‌ డిమాండ్‌ అనూహ్యంగా పడిపోతున్న ఇలాంటి పరిస్థితుల్లో విద్యుదుత్పత్తి, వినియోగం మధ్య సమతూకాన్ని పరిరక్షించకపోతే విద్యుత్‌ సరఫరా వ్యవస్థ (గ్రిడ్‌) కుప్పకూలే ప్రమాదముంటుంది.

అయితే, డిమాండ్‌ ఎంతగా పడిపోయినా గ్రిడ్‌ను పరిరక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. వాస్తవానికి సోమవారం రాత్రి 4,300 మెగావాట్లకు పడిపోయిన విద్యుత్‌ డిమాండ్‌ మంగళవారం పగటి వేళల్లో 5,803 మెగావాట్లకు పెరిగింది. అయితే, రాత్రి వేళల్లో 3,132 మెగావాట్లకు.. అర్ధరాత్రి మరింత తగ్గి 2,809 మెగావాట్లకు పడిపోయింది. వ్యవసాయ విద్యుత్‌ వినియోగం లేకపోవడం, ఏసీలు, ఫ్యాన్లు వాడకపోవడంతో డిమాండ్‌ అనూహ్యంగా తగ్గింది. యాసంగి పంటలతో పాటు రాష్ట్ర అవసరాలకు ప్రస్తుతం 12 వేల నుంచి 13 వేల మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేసేందుకు ట్రాన్స్‌కో ఏర్పాట్లు చేసుకోగా, నాలుగో వంతుకు డిమాండ్‌ పడిపోవడం విశేషం. 

రిజర్వు షట్‌డౌన్‌.. బ్యాకింగ్‌ డౌన్‌:  
విద్యుదుత్పత్తి, సరఫరా మధ్య సమతౌల్యాన్ని కాపాడి గ్రిడ్‌ను పరిరక్షించడానికి కొన్ని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను రిజర్వు షట్‌ చేయడంతో పాటు మరికొన్నింటిలో ఉత్పత్తిని నిలిపివేసి బ్యాకింగ్‌ డౌన్‌ చేశారు. 2,442 మెగావాట్ల జల విద్యుత్‌ లభ్యత ఉండగా, ప్రస్తుతం జూరాల, పులిచింతల, సాగర్‌ జల విద్యుత్‌ కేంద్రాల నుంచి 1,150 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నారు. కేటీపీపీలో ఒక యూనిట్, కేటీపీఎస్‌లో 2 యూనిట్లు, బీటీపీఎస్‌లో ఒక యూనిట్‌ను రిజర్వు షట్‌డౌన్‌లో ఉంచా రు. మిగిలిన థర్మల్‌ ప్లాంట్లలో పూర్తిగా ఉత్పత్తి నిలిపివేసి బ్యాకింగ్‌ డౌన్‌ చేశారు. ఒక వేళ అనూహ్యంగా విద్యుత్‌ డిమాండ్‌ పెరిగితే మరుక్షణమే థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేసుకునేలా అందుబాటులో ఉంచడాన్ని రిజర్వు షట్‌డౌన్‌ లో ఉంచడం అంటారు. థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను పూర్తిగా మూసివేస్తే మళ్లీ ఉత్పత్తిని ప్రారంభించి పూర్తి సామర్థ్యం పెంచడానికి కనీసం 12 గంటల సమయం పడుతుంది. అందుకే ఈ షట్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top