
మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేటలో యూరియా కోసం సహకారం సంఘం కార్యాలయం ముందు రైతుల లైన్లు
సాక్షి, హైదరాబాద్/సాక్షినెట్‌వర్క్: రైతు వేదికల వద్ద కూడా రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. కొద్ది రోజులుగా యూరియా పంపిణీలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 500 రైతు వేదికల వద్ద యూరియా అమ్మకాలు జరిపేందుకు వీలుగా రెండు రోజుల వ్యవధిలో 500 ఈపాస్ మెన్లు తెప్పించి, సిబ్బందికి శిక్షణ ఇప్పించి యూరియా అమ్మకాలు చేపట్టినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. యూరియా అవసరం ఉన్న రైతులకు టోకెన్లు జారీ చేసి 500 రైతు వేదికల వద్ద సోమవారం యూరియా పంపిణీ చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. యూరియా పంపిణీపై మంత్రి తుమ్మల ఆదేశాలతో వ్యవసాయ శాఖ కార్యాలయంలో అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి పర్యవేక్షిస్తున్నారు.
ఇంకా తప్పని కష్టాలు
మహబూబాబాద్ జిల్లా కురవి సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం బారులుతీరారు. దంతాలపల్లి మండలంలో గంటల తరబడి రైతులు క్యూలో నిల్చున్నారు.
» వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రంగాపురం, కొత్తూరు, మనుబోతులగడ్డకు చెందిన రైతులు మండల కేంద్రానికి ఆదివారం రాత్రి 1 గంటకు వచ్చి బారులుతీరారు. ఖానాపురంలో ఆయా గ్రామాలకు ఇవ్వడం లేదని, కొత్తూరు, మనుబోతులగడ్డ సొసైటీ గోదాంకు వస్తుందని తెలియడంతో అక్కడకు వెళ్లి లైన్‌లో నిల్చున్నారు. ఈ క్రమంలో క్యూలో నిల్చున్న రైతు లావుడ్య యాకూబ్ ఫిట్స్‌తో కిందపడిపోయాడు.
» హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
» ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రోజురోజు యూరియా కష్టాలు ఎక్కువవుతున్నాయి. దేవరకద్రలో టోకెన్ల కోసం తోపులాట జరిగింది. హన్వాడలో తెల్లవారుజాము 3 గంటల నుంచి క్యూలైన్‌లో ఉంటే యూరియా లేదని చెప్పడంతో రైతులు ఆగ్రహంతో ఒక్కసారిగా పోలీసులను తోసుకుంటూ బారికేడ్లను ధ్వంసం చేశారు. అనంతరం చించోళీ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మహమ్మదాబాద్ మండలం వెంకట్‌రెడ్డి పల్లి గేట్ వద్ద జాతీయ రహదారిపై ఉదయం 6 గంటల నుంచి రెండు గంటల పాటు రైతులు ధర్నా చేశారు.
» వనపర్తి జిల్లాలో ఖిల్లాఘనపురంలో రైతులు వనపర్తి–మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
» నారాయణపేట జిల్లాలోని ధన్వాడ పీఏసీఎస్‌కు రైతులు తెల్లవారుజామునే చేరుకొని చెప్పులు, రాళ్లను క్యూలో పెట్టారు. పీఏసీఎస్ గేటు తెరిచే సమయంలో రైతులందరూ ఒక్కసారిగా లోపలికి చొచ్చుకురావడంతో పోలీసులు కిందపడ్డారు.