ఇదేమైనా బాహుబలి సినిమానా?

CPI Leader Sambasivarao Fires On Telangana Govt - Sakshi

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షలకు ఇన్ని ఆంక్షలా?

ప్రభుత్వం, టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ బోర్డుపై కూనంనేని ఆగ్రహం

చలో డీజీపీ ముట్టడికి యత్నించిన ఏఐవైఎఫ్‌ నేతలు, ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులు  

హైదరాబాద్‌: ఈ బారు నుంచి ఆ బారుకు దూకడానికి ఇది బాహుబలి సినిమా కాదని, ఈ అభ్యర్థులేమీ సినిమా షూటింగ్‌లో పాల్గొనడం లేదంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. తప్పులతడకగా ఇచ్చిన ప్రశ్నలకు మార్కులను కలిపి కోర్టు తీర్పును గౌరవించాలంటూ ప్రభుత్వం, తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ)కు కూనంనేని సూచించారు.

శనివారం ఏఐవైఎఫ్‌ పిలుపుమేరకు ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థుల డీజీపీ కార్యాలయం ముట్టడి భగ్నమయ్యింది. అభ్యర్థులు ప్లకార్డులు చేతబూని బోర్డు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీగా ముట్టడికి ప్రయత్నిస్తున్న సమయంలో వీరందరినీ పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి నారాయణగూడ, అబిడ్స్, బేగంబజార్‌ పీఎస్‌లకు తరలించారు.

మద్దతు తెలిపేందుకు వచ్చిన కూనంనేని మాట్లాడుతూ..గత 15 రోజులుగా న్యాయంకోసం ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులు, ఇతర ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. తక్షణం అభ్యర్థులకు న్యాయం చేయకపోతే మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top