కేసీ వేణుగోపాల్‌తో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి, మీనాక్షి నటరాజన్
మంత్రులు, నేతల విభేదాలను అంతర్గతంగా పరిష్కరించుకోండి
సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీలకు సూచించిన కాంగ్రెస్ అధిష్టానం
స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల అమలుపై చర్చలు
15 రోజుల్లోగా డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తికి నిర్ణయం
ప్రతి ఉమ్మడి జిల్లాలో కచ్చితంగా ఒక ఓసీ, ఒక బీసీ డీసీసీ అధ్యక్షుడు!
విధాన నిర్ణయాల్లో డీసీసీలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాలని చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌లో, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఏఐసీసీ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యంగా మంత్రుల స్థాయిలోనే విభేదాలు రచ్చ కెక్కడంపై పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణు గోపాల్ రాష్ట్ర నేతలకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను బహిరంగ వేదికలు, మీడియా ముందు మాట్లాడటాన్ని కేసీ తప్పుపట్టినట్లు తెలిసింది.
డీసీసీ అధ్యక్ష నియా మకాల అంశంపై చర్చించేందుకు శనివారం ఢిల్లీకి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌లు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించారు. ఈ సందర్భంగా ఇటీవల పలువురు రాష్ట్ర మంత్రులు, నేతల మధ్య పొడచూపిన విభేదాలపై ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది.
అయితే, వివాదాలను పరిష్కరించే దిశగా తీసుకున్న చర్యలను ఆయనకు రాష్ట్ర నేతలు వివరించారు. సమస్యలపై అంతర్గతంగా చర్చించుకోవా లని, రచ్చకెక్కవద్దని నేతలకు కేసీ ఈ సందర్భంగా సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్లపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్లపై నవంబర్ 3న హైకోర్టులో విచారణ ఉన్నందున ఆ తర్వాత మరోసారి ఈ అంశంపై చర్చించాలని నిర్ణయించినట్లు సమాచారం.
పక్షం రోజుల్లో కొత్త డీసీసీలు
పార్టీ సంస్థాగత నిర్మాణంలో ప్రధానపాత్ర పోషించే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలను పక్షం రోజుల్లో పూర్తి చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పరిశీలకుల నుంచి అందిన నివేదికలు, స్థానిక సమీకరణలు, నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ సమర్ధులైన వ్యక్తులను అధ్యక్షులుగా నియమించాలని నిర్ణయించారు.
ముందునుంచీ చెబుతున్నట్లుగా పార్టీ పదవుల్లోనూ 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ, మహిళలకు ప్రాధాన్యమిస్తూ అన్ని వర్గాలవారికి న్యాయం చేయాలని భావిస్తోంది. మీనాక్షి నటరాజన్, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాధన్‌లతో కేసీ వేణుగోపాల్ ఇందిరాభవన్‌లో శనివారం సమావేశమై రెండు గంటలపాటు చర్చించారు. రాష్ట్ర పరిశీలకుల నుంచి వచ్చిన పేర్లను ముందుపెట్టుకొని జిల్లాలవారీగా నేతల నుంచి విడివిడిగా అభిప్రాయాలను సేకరించారు.
కచ్చితంగా ఒక ఓసీ, ఒక బీసీ..
ఈ భేటీలో ప్రధానంగా జిల్లాలవారీగా పరిశీలనకు వచ్చిన ముగ్గురు అభ్యర్థుల పేర్లపై అభిప్రాయాలను సేకరించినట్లు తెలిసింది. ప్రతి ముగ్గురు పేర్లలో ఒక ఓసీ, ఒక బీసీ ఉన్నారని చెబుతున్నారు. జిల్లాల్లో ఉండే కుల సమీకరణలు, అభ్యర్థి బలాబలాలు, పార్టీపై ఉన్న నిబద్ధతను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థిత్వాలపై చర్చించారు.
కొన్ని జిల్లాల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల బంధువులు, మిత్రుల పేర్లు రాగా వాటిని పక్కనపెట్టారని, మరికొన్ని జిల్లాల్లో పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా చేరినవారి పేర్లను ప్రత్యేకంగా గుర్తించి జాబితా నుంచి తొలగించారని తెలుస్తోంది. ఇప్పటికే అధ్యక్ష పదవుల్లో ఉన్నవారిని సైతం జాబితాల నుంచి తొలగించి మిగతా పేర్లపైనే ఎక్కువగా చర్చలు జరిగినట్లు తెలిసింది.
అభిప్రాయాల సేకరణ ప్రక్రియ పూర్తయిన దృష్ట్యా, ఇందులో 42 శాతం బీసీలు ఉండేలా హైకమాండ్ తన తదుపరి చర్చలు కొనసాగించనుంది. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ఓసీ, ఒక బీసీ అధ్యక్షుడు ఉండేలా అభిప్రాయాలు వచ్చినట్లు తెలిసింది. ఈ లెక్కన కచ్చితంగా 9 మంది రెడ్లు, 13–14 మంది బీసీలకు అవకాశం దక్కుతుందని చెబుతున్నారు.
డీసీసీలకు మరింత స్వేచ్ఛ
పార్టీ దీర్ఘకాలిక సంస్కరణల్లో భాగంగా జిల్లా యూనిట్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. నియోజకవర్గ అభ్యర్థులు మొదలు, పార్టీ, ప్రభుత్వ నియామకాల్లో వారి సూచనల మేరకే పదవుల పంపకాలు, జిల్లా స్థాయి సమస్యలపై పోరాటాలు చేసే స్వేచ్ఛ వారికి ఇచ్చే దిశగా ఈ భేటీలో సమాలోచనలు జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సంస్థాగత ఎన్నికల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు డీసీసీలే జవాబుదారీగా ఉండాలని, వారి అభిప్రాయం మేరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పార్టీ విధానాల రూపకల్పన ఉండేలా భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ‘కేసీతో సంస్థాగత వివరాలపై చర్చించాం. అడిగిన వివరాలు అందించాం. సలహాలు, సంప్రదింపులు జరిపాం’అని తెలిపారు. అయితే, ఎప్పటిలోగా డీసీసీలను ప్రకటిస్తారన్నది మాత్రం చెప్పలేదు. 15 రోజుల్లోగా డీసీసీలను ప్రకటించాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


