కోమటిరెడ్డిని సస్పెండ్‌ చేయాలి.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. వారించిన రేవంత్‌ రెడ్డి!

Congress Leader Konda Surekha Sensational Comments On T Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితి అంతర్గత కుమ్ములాటతో రచ్చకెక్కుతోంది. పీసీసీ చీఫ్‌ వర్గం, సీనియర్లుగా విడిపోయి పరస్పర విమర్శలు గుప్పించుకుంటోంది. ఈ క్రమంలో పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జిని మార్చేసిన అధిష్టానం.. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేస్తోంది. అయినా నేతల మధ్య ఏదో ఒక వివాదం తెరపైకి వస్తోంది.  తాజాగా.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అందరం కలిసి పనిచేయలేకే ఓడిపోయామని, పార్టీకి నష్టం చేసేవాళ్లను ఉపేక్షించాల్సిన అవసరం ఏముందని వ్యాఖ్యానించారామె. కోమటిరెడ్డిని సస్పెండ్‌ చేయాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం గాంధీ భవన్‌లో పీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క ఇతర నేతలు హాజరయ్యారు. హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌, రేవంత్‌ పాదయాత్ర పైనా ఇందులో చర్చించినట్లు తెలుస్తోంది.  ఆ సమయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. 

‘అందరం కలిసి పని చేయలేకపోవడం వల్లే ఓడిపోయాం. ఇప్పటికైనా అందరం కలిసి పని చేయాలి. పార్టీకి నష్టం చేసేవారిని ఉపేక్షించడం ఎందుకు?. ఎంపీ కోమటిరెడ్డి పార్టీకి నష్టం చేకూర్చారు. అలాంటి వాళ్లను వెంటనే సస్పెండ్‌ చేయాలి’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి జోక్యం చేసుకున్నారు. వ్యక్తిగత అంశాలు మాట్లాడవద్దన్న రేవంత్‌.. ఏమైనా ఉంటే ఇన్‌ఛార్జ్‌ను కలవాలని సూచించారు. ఇది పార్టీ సమావేశం గనుక.. సమావేశం ఎజెండాపైనే మాట్లాడాలని ఆయన కొండా సురేఖకు సూచించారు. దీంతో ఆమె శాంతించారు.

ఆపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న కొండా సురేఖ.. పాదయాత్రతో జనంలోకి వెళ్తే మంచి స్పందన వస్తుందని పేర్కొన్నారు. ఇక.. పీసీసీ చీఫ్‌ లేదంటే సీఎల్పీ నేత లేదంటూ ఇద్దరూ కలిసి పాదయాత్ర చేయాలని భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఎవరు యాత్ర చేసినా భద్రాచలం నుంచే ప్రారంభించాలని వీరయ్య సూచించినట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top