
సాక్షి, హైదరాబాద్: ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, అధికార పార్టీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ప్రశ్నోత్తరాల సమయంలో రసమయి ప్రశ్నలు అడుగుతుండగా డిప్యూటీ స్పీకర్ పద‍్మారావు.. మైక్ కట్ చేసి ఎమ్మెల్యే గొంగడి సునీతకు మైక్ ఇచ్చారు. ఇంతలో దీనిపై రసమయి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సభలో మాట్లాడదాం అంటే మాట్లాడే అవకాశాలు రావు.. కనీసం ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఇవ్వకుంటే ఎలా? అని అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నలే అడగవద్దు అన్నప్పుడు తమకు ప్రశ్నలు ఎందుకు ఇవ‍్వడం అంటూ అసంతృప్తి వ్యక్తపరిచారు. తాను ప్రశ్నలే అడుగుతున్నానని వాదించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఆయన వ్యాఖ్యలపై పద్మారావు స్పందిస్తూ.. తొందరగా ప్రశ్నలే అడగండి.. ప్రసంగాలు వద్దూ అంటూ వ్యాఖ్యలు చేశారు. గంటన్నరలో 10 ప్రశ్నలు పూర్తి చేసుకోవాలని చెప్పారు. దీంతో అసహనం వ్యక్తం చేస్తూ రసమయి తన కుర్చీలో సైలెంట్‌గా కూర్చుండిపోయారు.