
సాక్షి, హైదరాబాద్: గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రమాద కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమని రేవంత్ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం ప్రకటించారు.
ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించటంతో భారీ ప్రాణనష్టం తప్పిందని.. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 40 మందిని ప్రాణాపాయ స్థితి నుండి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారని సీఎం రేవంత్ అన్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక బృందం తమ శక్తియుక్తులు ప్రయత్నించిందన్నారు. కాగా, చార్మినార్ గుల్జార్‌హౌస్‌లో ఇవాళ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా 17మంది మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
మృతి చెందిన వారిలో రాజేంద్రకుమార్ (67),అభిషేక్ మోదీ (30), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఆరుషి జైన్ (17), శీతల్ జైన్ (37), ఇరాజ్ (2), హర్షాలీ గుప్తా (7), రజని అగర్వాల్, అన్య మోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, రిషభ్, ప్రథమ్ అగర్వాల్, ప్రాంశు అగర్వాల్ ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్ చిన్నదే అయినా భవనంలో 30 మంది ఉండటంలో భారీ ప్రాణనష్టం జరిగింది.