మంత్రులు జూపల్లి, వాకిటితో కలిసి పాలమూరు ప్రాజెక్టుపై సమీక్షిస్తున్న సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల భూసేకరణనూ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. భూసేకరణలో జాప్యం జరగకుండా తక్షణమే బిల్లుల చెల్లింపులు జరిగేలా చూస్తామన్నారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికి కీలక సూచనలు చేశారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల పెండింగ్ బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సంబంధిత జిల్లాధికారులతో జిల్లా మంత్రులు సమీక్షించి పనుల్లో పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, రాకేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, సీఎస్ కె.రామకృష్ణారావు పాల్గొన్నారు.
1226 గ్రామాలకు తాగునీరు : మంత్రి ఉత్తమ్
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు తొలిదశ కింద నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 1226 గ్రామాలకు తాగునీటి సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు అనుబంధ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని కరువు పీడిత జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు తాగునీరు, పారిశ్రామిక నీటి సరఫరా అందిస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం జిల్లా ప్రాజెక్టులపై సచివాలయంలోఉత్తమ్ సమీక్షించారు. ప్రాధాన్యతలను పున:సమీక్షించడానికి, పనులను వేగవంతం చేయడానికి పక్షం రోజుల్లోగా మరోసారి జిల్లా ప్రాజెక్టులపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని జిల్లా ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు.
జూరాల పూడిక తొలగింపు
గత బీఆర్‌ఎస్ పాలనలో పాలమూరు ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ అన్నారు. పూడికతో జూరాల ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 8 టీఎంసీల కంటే తగ్గిపోయిందన్నారు. జలాశయాల పునరుద్ధరణకు కేంద్రం అమలు చేస్తున్న ‘డ్రిప్’పథకం కింద జూరాల ప్రాజెక్టును చేర్చి ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. డ్రిప్ కింద పూడికతీతతోపాటు ప్రాజెక్టు భద్రత, నిల్వ సామర్థ్యం, నిర్వహణ మెరుగు అవుతుందని తెలిపారు.


