త్వరలోనే పోడు పట్టాల పంపిణీ

CM KCR To Hand Over Forest Rights Pattas To Tribals Soon: Satyavathi Rathod - Sakshi

సీఎం చేతుల మీదుగా కేస్లాపూర్‌ నుంచే శ్రీకారం

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ వెల్లడి

దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి నాగోబా దర్శనం 

సాక్షి, ఆదిలాబాద్‌: రాష్ట్రంలో త్వరలోనే పోడు పట్టాలు పంపిణీ చేస్తామని, సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా కేస్లాపూర్‌ నుంచే అందిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ కింద ఎక్కువ మందికి న్యాయం చేసేలా చూస్తామని, రైతుబంధు వర్తింపజేస్తామన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జరుగుతున్న నాగోబా జాతరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి ఆమె విచ్చేశారు.

నాగోబాను దర్శించుకున్న అనంతరం గిరిజన దర్బార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో 3.8 లక్షల ఎకరాల పోడు భూములకు రైతుబంధు ఇచ్చి గిరిజనుల కోసం అనేక గురుకులాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఈ విద్యాసంవత్సరం నుంచే అగ్రికల్చర్‌ బీఎస్సీ ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు.

కొందరు ఏం తెలియకుండా మాట్లాడుతున్నారని నాగోబా జాతరకు వచ్చిన కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్రం ఉలుకూపలుకూ లేకుండా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల విషయంలో బీజేపీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను ఆమోదించి పంపితే కేంద్రం పక్కనబెట్టిందంటూ దుయ్యబట్టారు.

మెస్రం పెద్దలు సూచించినట్లుగా అభివృద్ధి పనులు: ఇంద్రకరణ్‌
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లలో 10 శాతం రిజర్వేషన్ల ప్రకారం 9 వేలకుపైగా ఉద్యోగాలు గిరిజనులకే దక్కుతాయన్నారు. నాగోబా సన్నిధిలో అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ రూ. 12.5 కోట్ల నిధులను తక్షణమే మంజూరు చేశారని తెలిపారు. మెస్రం పెద్దలు సూచించిన ప్రతిపాదనలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం దేవాలయాలకు ఏమైనా నిధులు ఇచ్చిందా? అంటూ విమర్శించిన కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా రాష్ట్రంలోని ఆలయాలకు మంజూరు చేశారా అంటూ ధ్వజమెత్తారు. గిరిజన దర్బార్‌లో ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీఓ వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దండే విఠల్, రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, రేఖాశ్యామ్‌ నాయక్, రాథోడ్‌ బాపురావు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top