శ్వేత సౌధం.. చౌమహల్లా ప్యాలెస్‌

Chowmahalla Palace Special Story In Hyderabad - Sakshi

సాక్షి, చార్మినార్‌: చౌమహల్లా ప్యాలెస్‌ సందర్శన తిరిగి ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 3వ తేదీ నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు చౌమహల్లా ప్యాలెస్‌ ట్రస్ట్‌ డైరెక్టర్‌ కిషన్‌రావు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం జారీ చేసే కరోనా నిబంధనలన్నీ పాటిస్తూ అవసరమైన ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకోవడానికి సిద్ధగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఆరు నెలలుగా చౌమహాల్లా ప్యాలెస్‌ సందర్శనను ట్రస్ట్‌ నిలిపి వేసింది. వచ్చే నెల 3వ తేదీ నుంచి సందర్శకుల అందుబాటులోకి వస్తున్న సందర్భంగా సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.  

  • నిజాం కాలంలో వినియోగించిన ఫర్నిచర్, మంచాలు, దుస్తులు, తల్వార్లు, ఫొటోలు తదితర విలువైన పురాతన వస్తువులన్నింటిని చౌమహల్లా ప్యాలెస్‌లోని నాలుగు ప్యాలెస్‌లలో భద్రపరిచారు. ప్రస్తుతం నిజాం ట్రస్ట్‌ పర్యవేక్షణలో చౌమహల్లా ప్యాలెస్‌ కొనసాగుతోంది. 
  • అసఫ్‌ జాహీల రాచరిక పాలనకు పాతనగరంలోని చౌమహల్లా ప్యాలెస్‌ నిలువుటద్దంగా నిలుస్తుంది.  
  • రెండో నిజాం కాలంలో చార్మినార్‌–లాడ్‌బజార్‌కు అతి సమీపంలో ఈ ప్యాలెస్‌ నిర్మాణం జరిగింది.  
  • చార్మినార్‌ కట్టడం నుంచి వాకబుల్‌ డిస్టెన్స్‌లో ఉన్న ఈ చౌమహల్లా ప్యాలెస్‌ యూరోపియన్‌ శైలిలో నిర్మించిన శ్వేతసౌధం. 
  • ఇది నాలుగు ప్యాలెస్‌ల సముదాయం. 
  • ఏకాంతం (ఖిల్వత్‌)గా నిర్మించిన ఈ ప్యాలెస్‌లో పలు నిర్మాణాలు జరిగాయి.  
  • 5వ నిజాం అప్జల్‌–ఉద్‌–దౌలా–బహదూర్‌ పాలనా (1857–69) కాలంలో ఖిల్వత్‌ ప్యాలెస్‌లో నాలుగు ప్యాలెస్‌ల నిర్మాణం జరిగింది. 
  • టెహ్రాన్‌లోని షా ప్యాలెస్‌ను పోలిన ఆర్కిటెక్చర్‌లో ఐదో నిజాం అఫ్తాబ్‌ మహల్, మఫ్తాబ్‌ మహల్, తహనియత్‌ మహల్, అప్జల్‌ మహల్‌ల నిర్మాణం జరిగింది.
  • 1912లో ఏడో నిజాం ప్యాలెస్‌కు చేయించిన మరమ్మతులతో ప్యాలెస్‌ మరింత శోభాయమానంగా మారింది. ఇది నిజాం ప్రభువుల నివాస గృహంగా ఉండేది.
  • దాదాపు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడింది. ఆనాటి కాలంలో విద్యుత్‌ లైట్లు లేని కారణంగా ప్యాలెస్‌లో వెలుగుల కోసం షాండిలియర్లను ఏర్పాటు చేశారు. 
  • వీటిలో పొగరాని కొవ్వొత్తులు, మైనపు ఒత్తులు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం విద్యుత్‌ దీపాలు ఉండడంతో షాండిలియర్లు దేదీప్యమానంగా వెలుగుతూ చౌమహల్లా ప్యాలెస్‌కు మరింత శోభను తీసుకువస్తున్నాయి.

 సందర్శన వేళలు, మార్గం

  • ఎలా వెళ్లాలి: చార్మినార్‌ కట్టడం నుంచి లాడ్‌బజార్,ఖిల్వత్‌ చౌరస్తా ద్వారా ముందుకెళితే ఖిల్వత్‌ వస్తుంది. 
  •  సందర్శించు వేళలు: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు. 
  • సెలవు: శుక్రవారం. 
  • టికెట్‌ ధరలు: చిన్నారులకు రూ. 20, పెద్దలకు రూ.60, విదేశీయులకు రూ.200 
  • రవాణా సౌకర్యం: నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఆర్టీసి బస్సు సౌకర్యం కలదు. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా ఆర్టీసి బస్సులు తక్కువగా అందుబాటులో ఉన్నాయి.  
  • పార్కింగ్‌: ప్యాలెస్‌ ఆవరణలో చార్జితో కూడిన పార్కింగ్‌ సౌకర్యం కలదు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top