హైవేలపై సీసీ ఫుటేజ్‌: రాత్రి వేళ కష్టమే.. స్పీడ్‌ కూడా సమస్యే! | Sakshi
Sakshi News home page

హైవేలపై సీసీ ఫుటేజ్‌: రాత్రి వేళ కష్టమే.. స్పీడ్‌ కూడా సమస్యే!

Published Sat, Mar 25 2023 2:15 AM

CCTV Cameras Not Working On Highways In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమన్‌గల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ రైతు శ్రీశైలం హైవే సమీపంలోని తన పొలానికి నీళ్లు పెడదామని అర్ధరాత్రి 1.30 గంటలకు ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో హైవే మీద వెనక నుంచి 130–140 కి.మీ వేగంతో వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీ కొట్టింది. దూరంగా ఎగిరిపడిన రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. 

కాగా, ఢీకొట్టిన వాహనం డ్రైవర్‌ హైవేలోనే ముందుకు వెళితే సీసీటీవీ కెమెరాలో రికార్డై పోలీసులకు దొరికిపోతానని ఊహించాడు. కడ్తాల్‌ టోల్‌గేట్‌ లైన్‌లో కాకుండా సర్వీస్‌ రోడ్డు గుండా పరారయ్యాడు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే సీసీటీవీ కెమెరా ఉన్నా.. అది పని చేయకపోవటంతో కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. సీసీటీవీ కెమెరాల పరిస్థితికి ఆమన్‌గల్‌ ఘటన అద్దం పడుతుంది. కేసు దర్యాప్తులో కీలకంగా నిలిచే కెమెరాలు పని చేయకపోవటం, పని చేసినా రాత్రి సమయాల్లో రికార్డయ్యే ఆధునిక కెమెరాలు కాకపోవటంతో హిట్‌ అండ్‌ రన్‌ కేసుల దర్యాప్తులో పోలీసులు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. 

రాత్రివేళ కష్టమే.. స్పీడ్‌ కూడా సమస్యే..
హైవేలలో ఉదయం పూట జరిగే రోడ్డు ప్రమాదాలు ఆయా ప్రాంతాల్లో పని చేస్తున్న సీసీటీవీ కెమెరాల్లో బాగానే రికార్డవుతున్నాయి. అయితే రాత్రి పూట జరిగే ప్రమాదాలు మాత్రం సరిగా రికార్డు కావటం లేదు. వాహనాల లైట్ల కాంతి ఎక్కువగా ఉండటం, వీధి లైట్ల వెలుతురూ కెమెరాల మీద పడుతుండటంతో రాత్రివేళ దృశ్యాలు సరిగా రికార్డు కావటం లేదని శంషాబాద్‌ జోన్‌ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే జాతీయ రహదారులలో స్పీడ్‌ బ్రేకర్లు లేకపోవటంతో వాహనాలు 100–130 కి.మీ వేగంతో దూసుకెళ్తుంటాయి. అంత స్పీడ్‌లో వెళ్లే వాహనాల నంబర్లను ఏఎన్‌పీఆర్‌ (ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌) కెమెరాలు గుర్తించలేకపోతున్నాయని ఆయన పేర్కొన్నారు.

నిధుల్లేవు.. నిర్వహణ లేదు..
సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, నిర్వ హణ కోసం ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రత్యేక వ్యవస్థా లేదు. అందువల్ల ప్రత్యేకంగా నిధుల కేటాయింపూ లేదు. హైవేలతో పాటు నగరాలు, పట్టణాల్లోని రోడ్లపై వీటిని ఏర్పాటు చేస్తున్న పోలీసు శాఖ కూడా సొంత నిధులు వినియోగించడం లేదు. సామాజిక బాధ్యతగా కార్పొరేట్‌ సంస్థలు, ఇతర సంఘాలు, సంస్థలు ఇచ్చే నిధులతో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఏర్పాటు చేసిన కెమెరాలు 10 లక్షలకు పైగా ఉన్నాయి. ఇందులో 40% పనిచేయడం లేదని వెల్లడైంది. కెమెరాల ఏర్పాటే కష్టసాధ్యంగా ఉన్న పరిస్థితుల్లో, ఏర్పాటైన కెమెరాల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంటోంది.

సీసీటీవీ ఫుటేజీలే ప్రధాన ఆధారం.. 
ప్రధాన నగరాల్లో జరిగే రోడ్డు ప్రమాదాలు, చైన్‌ స్నాచింగ్‌లు, దాడులు, హత్యోదంతాలు ఇతర త్రా కేసుల్లో నేరస్తులను చాలావరకు.. ఆయా ఘటనలకు సంబంధించిన సీసీటీవీ కెమెరాల రికార్డింగుల ఆధారంగానే పోలీసులు గుర్తిస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో కెమెరాలు పనిచేయనప్పుడు మాత్రం ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి.  

ఆధునిక కెమెరాలైతేనే బెటర్‌.. 
రాష్ట్రంలో ప్రస్తుతం బుల్లెట్, ఏఎన్‌పీఆర్‌ కెమెరాలున్నాయి. ఆధునిక ఫీచర్లు తక్కువగా ఉండే ఏఎన్‌పీఆర్‌ కెమెరాల్లో 10– 20మీటర్లకు మించి జూమ్‌ చేయలేం. అదే ఫేస్‌ రికగ్నిషన్, పాన్‌ టిల్ట్‌ జూమ్‌ (పీటీజెడ్‌)వంటి ఆధునిక కెమెరాలు అయితే 1కి.మీ. దూరం వరకూ జూమ్‌ చేయవచ్చు. 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ ఉంటాయి. వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి, నంబరు ప్లేట్లను రీడింగ్‌ చేసే సామర్థ్యం ఉన్న ఈ తరహా కెమెరాలు ఏర్పాటు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement