
వారితో చర్చల ప్రసక్తే లేదు
అప్పుల్లోనే తెలంగాణ రైజింగ్...త్వరలోనే డౌన్ ఫాల్ తథ్యం
మీడియాతో బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదులు, మావోయిస్టులు ఒకటేనని, అందువల్ల టెర్రరిస్టులు లేదా మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టంచేశారు. మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పినా వినకపోవడంతోనే కేంద్రం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలైట్లతో జరిపిన చర్చలు ఎందుకు విఫలం అయ్యాయో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలైట్లను చర్చలకు పిలిచి ఎన్‌కౌంటర్ చేసిందని, ఇప్పుడు కేంద్రం ‘కగార్’నిర్వహిస్తుంటే అభ్యంతరం ఎందుకు చెబుతున్నారని నిలదీశారు. శనివారం బీజేపీ కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అవినీతి, లోటు బడ్జెట్, అప్పుల్లోనే తెలంగాణ రైజింగ్ అని, వీటన్నింటి ప్రభావంతో త్వరలోనే ఇక్కడి కాంగ్రెస్ సర్కార్ డౌన్ ఫాల్ తథ్యమని జోస్యం చెప్పారు.
హైడ్రోజన్ బాంబు తుస్సుమంది..
రాహుల్‌గాంధీ పేలుస్తానన్న హైడ్రోజన్ బాంబు తుస్సుమందని రాంచందర్‌రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ ఓట్‌చోరీ ఆరోపణలతో ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారని చెప్పారు. గతేడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లోని సగానికిపైగా మంది రెండు రాష్ట్రాల్లో ఓట్లేశారని చెప్పారు. అందువల్ల డూప్లికేట్ ఓట్ల తొలగింపు వంటి వాటిని సరళీకరించాల్సి ఉందని పేర్కొన్నారు.
కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు రాంచందర్‌రావు జవాబు నవ్వులు పూయించింది. ‘అక్కడ టికెట్ కోసం 3,4 దరఖాస్తులు వచ్చాయి. అంతకంటే తమకు పద్మశ్రీ ఇప్పించాలంటూ అప్లికేషన్స్ ఇస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది’అన్నారు.
రాష్ట్రంలో రాజకీయ శూన్యత...
రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని, దానిని బీజేపీ అధికారంలోకి రావడం ద్వారా పూరిస్తామని ఒక ప్రశ్నకు రాంచందర్‌రావు బదులిచ్చారు. తమ వద్ద ఇందుకు అవసరమైన రోడ్ మ్యాప్ సిద్ధంగా ఉందన్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై, అందులో ముడిపడిన అవినీతిపై, కాంట్రాక్టర్ల పాత్ర ఇలా అన్ని అంశాలపై సీబీఐతో విచారణ కోరాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోబియా పట్టుకుందని, అందుకే ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారన్నారు. గత పదకొండేళ్లలో గ్రూప్–1 పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని కారణంగా రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగిందని రాంచందర్‌రావు చెప్పారు.