సోమవారం ఘట్‌కేసర్‌లో వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాన్‌క్లేవ్‌లో మాట్లాడుతున్న నితిన్ నబీన్
విద్యార్థులకు న్యాయం జరిగేదాకా పోరాడతాం
మన జెన్–జీ రాళ్లు విసిరే తరం కాదు... జాతిని నిర్మించే తరం
ఏ విషయంలోనూ సత్వర మార్గాలు వద్దు.. జీవితం ఒక సుదీర్ఘ పరుగు
ఇది 100 మీటర్ల పరుగు పందెం కాదు.. ఇది ఓపికకు పరీక్ష
వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాన్‌క్లేవ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్
సాక్షి, హైదరాబాద్/ఘట్‌కేసర్: ‘తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను గాలికొదిలేసిందని విమర్శించారు. సోమవారం బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఘట్‌కేసర్ వీబీఐటీ క్యాంపస్‌లో ‘వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాన్‌క్లేవ్’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భారత్–భవిష్యత్ సవాళ్లు, 2047 వికసిత్ భారత్ లక్ష్యం, 12 ఏళ్ల మోదీ పాలన తదితర అంశాలపై పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నితిన్ నబీన్ సమాధానమిచ్చారు.
మన యువతది తుక్‌డే తుక్‌డే మైండ్‌సెట్ కాదు
‘ఇతర దేశాల్లో సాగుతున్న జెన్–జీ ఉద్యమాలను అందిపుచ్చుకోవాలంటూ కొన్ని రాజకీయశక్తులు మన దేశంలోని యువతను రెచ్చగొడుతున్నాయి. కానీ భారత్‌లోని జెన్–జీ ప్రభుత్వ వ్యతిరేక శక్తులు కాదు. మన యువత అరాచకాలను విశ్వసించదు. ఇది రాళ్లు విసిరే తరం కాదు... జాతిని నిర్మించే తరం.. వారిది తుక్‌డే తుక్‌డే మైండ్‌సెట్ కాదు. యువ భారతీయులు దేశాభివృద్ధికి, నూతన ఆవిష్కరణలు, భవిష్యత్ భారతానికి వారి వంతు కృషి చేస్తున్నారు’ అని నితిన్ నబీన్ పేర్కొన్నారు.
‘జీవితానికి అడ్డదారులు ఉండవు...
యువత, విద్యార్థులు ఏ విషయంలోనూ సత్వర మార్గాలు ఎంచుకోవద్దని.. జీవితానికి అడ్డదారులు ఉండవని నితిన్ నబీన్ సూచించారు. ‘జీవితం అనేది ఒక సుదీర్ఘ పరుగు. ఇది 100 మీటర్ల పరుగుపందెం కాదు. ఇది ఓపికకు పరీక్ష’ అని వివరించారు. జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సినంత సమయం తీసుకోవాలని.. కానీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత తిరిగి ఆ నిర్ణయం సరైనదా కాదా అనే చర్చ జోలికి వెళ్లరాదని సూచించారు. విద్యార్థులు వాస్తవికత ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని.. అప్పుడే వారిలోని అసలైన సామర్థ్యం బయటపడుతుందన్నారు.
తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని.. అలా తొలినాళ్లలో తన భవిష్యత్తు ఏమవుతుందోనని గందరగోళానికి గురైనట్లు చెప్పారు. ఈ క్రమంలో తనకు లభించిన ఎలాంటి పనినైనా నిబద్ధతతో పూర్తి చేస్తూ అందులో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశానన్నారు. ఈ కాన్‌క్లేవ్‌లో నల్సార్, ఐఎస్‌బీ, హెచ్‌సీయూ, కేయూ, ఓయూ, ఐఐటీ, ఐఐఐటీ, హార్వార్డ్, ఎన్‌ఐటీ, ఇఫ్లూ, బిట్స్ తదితర విద్యాసంస్థల నుంచి దాదాపు 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర ఇన్‌చార్జి అభయ్ పాటిల్, మహారాష్ట్ర మంత్రి ఆశిష్ సెల్లార్, ఎంపీ రేఖా శర్మ, బీజేపీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, బీజేవైఎం అధ్యక్షుడు గణేశ్ కుండె, మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. మేకల శిల్పారెడ్డి, టెన్నిస్ క్రీడాకారిణి రష్మిక శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు.


