జూబ్లీహిల్స్ గల్లీల్లో కమలదండు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కమల దళం కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాజకీయాల్లో మొదటిసారిగా మంగళవారం కార్పెట్ బాంబింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా పార్టీ స్టార్ క్యాంపెయినర్స్, రాజస్థాన్ ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్, శాసన సభ, శాసన మండలి సభ్యులు, ఇతర ముఖ్య నాయకులంతా ఒక్కసారిగా నియోజకవర్గాన్ని చుట్టుముట్టనున్నారు. ప్రచార కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో గల్లీగల్లీ బీజేపీ నేతలతో కిక్కిరిసిపోవాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ప్రచారంలో వెనుకబడ్డారన్న ఆరోపణలను పటాపంచలు చేయాలని భావిస్తోంది. ఎన్నికల ప్రచారం ముగిసే వరకు నేతలంతా జూబ్లీహిల్స్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించింది.
ఏంటీ కార్పెట్ బాంబింగ్?
కుండపోత వర్షానికి క్లౌబ్ బరెస్ట్ అన్నట్లు రాజకీయాల్లో ఒక్కసారిగా అలాంటి ప్రభావంతమైన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడాన్ని కార్పెట్ బాంబింగ్ అంటారు. ఇది ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రాచుర్యంలో ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి అని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్టార్ క్యాంపెయినర్స్ 40 మందితో పాటు రాష్ట్ర నేతలందరూ ప్రచారంలో పాల్గొననున్నారు. బీజేపీ నేతలతో నియోకవర్గ వీధులన్నీ కిక్కిరిసిపోవడం ఖాయమని నేతలు పేర్కొంటున్నారు.
ప్రాంతీయ అభిమానాన్ని కొల్లగొట్టాలి..
నియోజకవర్గంలో ప్రాంతీయాభిమానాన్ని కొల్లగొట్లాని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఏ కాలనీలో ఏ ప్రాంతానికి చెందిన ప్రజలు ఉన్నారు. వారిని ప్రభావితం చేసే నేతలను గుర్తించి, ప్రచార కార్యక్రమంలో వారిని భాగస్వాములను చేయాలని యోచిస్తోంది. దీంతో ఉత్తరాది నుంచి వచి్చన వలస ఓటర్ల కోసం రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్, ఇతర నేతలను ప్రచారంలోకి దించుతున్నారు. అదే సమయంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల వారిని ఆకర్షించడం, జీఎఎస్టీ స్లాబ్‌లను తగ్గించడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించడానికి కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలాసీతారామన్ తో పాటు ఇతర నేతలను ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పార్టీ ప్రచార కార్యక్రమాల్లోముమ్మరంగా పాల్గొనున్నారు.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చే శాసన సభ ఎన్నికలకు సెమీ ఫైనల్ అంటూ నేతలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి రావాలంటే జూబ్లీహిల్స్ విజయంతో నాంధి పలకాలని పార్టీ నాయకత్వం చెబుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు లేరు, కార్పొరేటర్లు అంతంతే. బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉన్నా ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో లేదు. దీంతో వచ్చే ఏడాది జీహెచ్‌ఎంసీలో బీజేపీ జెండా ఎగురవేయాలని క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో, రాష్ట్రంలో బీజేపీ కుర్చీ దక్కించుకోవాలంటే జూబ్లీహిల్స్‌లో విజయం సాధించాలని నేతలు భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే కేంద్ర, రాష్ట్ర ముఖ్య నేతలతో స్టార్ క్యాంపెయినర్స్‌ను ఈ ఉప ఎన్నిక ప్రచారంలోకి దించుతున్నారు.


