సాక్షి, కరీంనగర్: తన తనయుడిపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఇటీవల నిరాధారమైన ఆరోపణల దృష్ట్యా.. నా ప్రజా జీవితమంతటా నేను ఎల్లప్పుడూ చట్టాన్ని గౌరవించానని, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నానని తెలియజేయాలనుకుంటున్నాను. నేను ఎలాంటి మచ్చ లేకుండా జీవించాను. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాను’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
‘‘పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయ పోరాటాల్లోకి లాగడం అనేది.. నాతో రాజకీయంగా పోరాడే ధైర్యం లేని వారి నిస్సహాయతను మాత్రమే ప్రతిబింబిస్తుంది. క్షేత్రస్థాయి నుండి వచ్చి, కార్పొరేటర్‌గా పనిచేసి, కఠోర శ్రమ, ప్రజా మద్దతుతో అంచెలంచెలుగా కేంద్ర మంత్రి అయిన ఒక బీసీ నాయకుడి ఎదుగుదలను కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
..రేపు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు ముందు.. నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయడానికి ఉద్దేశించిన రాజకీయ కుట్ర ఇది అని స్పష్టమవుతోంది. ఏది సరైనదో, ఏది తప్పో న్యాయవ్యవస్థే నిర్ణయిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. కాలమే ప్రతి ఆరోపణకు సమాధానం చెబుతుంది. ప్రతి కుట్రను బయటపెడుతుంది. సత్యమేవ జయతే’’ అంటూ ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.
నిరాధారమైన ఆరోపణలు వెలుగు చూసిన నేపథ్యంలో ఈ ప్రకటన
నాకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నాను. దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను.
నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు నా…— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 9, 2026
కాగా, కేంద్రమంత్రి బండి సంజయ్ తనయుడిపై హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సుచిత్ర ప్రాంతంలో ఉండే ఓ బాలిక (17) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపిస్తూ శుక్రవారం రాత్రి ఫిర్యాదురాగా పేట్ బషీరాబాద్ సీఐ విజయవర్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ (24) డిసెంబర్ 31న మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో స్నేహం పేరిట తిరుగుతూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి అదే రోజు రాత్రి అసభ్యకరంగా ప్రవర్తించాడనేది ప్రధాన ఆరోపణ. భగీరథపై పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 74, 75తోపాటు సెక్షన్ 11 రెడ్‌విత్ 12 పోక్సో చట్టం కింద నమోదు చేశారు. భగీరథపై గతంలో బహదూర్‌పల్లిలో ఉన్న కళాశాలలో ర్యాగింగ్‌తోపాటు డ్రగ్స్ విషయంపై ఫిర్యాదులు రాగా దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా, ప్రధాని మోదీ నగరానికి విచ్చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కుమారుడిపై పోక్సో కేసు నమోదుకావడం చర్చనీయాంశమైంది.


